Fri Dec 05 2025 09:22:58 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ముఖ్యమంత్రి రేవంత్ మాటలను ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదా?
కాంగ్రెస్ లో ఎక్కడైనా స్వేచ్ఛ ఎక్కువ. మంత్రి పదవులు రాకున్నా, వచ్చినా వారు అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతారు

కాంగ్రెస్ లో ఎక్కడైనా స్వేచ్ఛ ఎక్కువ. మంత్రి పదవులు రాకున్నా, వచ్చినా వారు అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతారు. పార్టీ అధికారంలోకి రానంత వరకూ అంతా బాగానే ఉంటారు. వచ్చిన తర్వాత తమకు మంత్రి పదవి కావాలని మఠం వేసి కూర్చుంటారు. తాము ఏదో విజయం సాధించి వచ్చినందునే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న బిల్డప్ లు ఇస్తారు. ఎవరు గెలిచినా అది పార్టీలో వ్యక్తిగత ప్రతిభ కాదు. గత ప్రభుత్వంపైన విసిగి వేసారిపోయిన ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశమివ్వాలని, పాపం కాంగ్రెస్ అని దానికి అధికారాన్ని కట్టబెట్టారు. అది కూడా పూర్తి స్థాయిలో సీట్లు కూడా రాలేదు. అయినా సరే కాంగ్రెస్ నేతలు మాత్రం బిల్డప్పులకు తక్కువేమీ కాదు.
మంత్రి పదవులు ఇవ్వకుంటే...?
మంత్రి పదవులు ఇవ్వకపోతే ఎమ్మెల్యేపదవికి రాజీనామా చేస్తామని బెదిరిస్తుంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి వంటి వారు అయితే ఒకడగు ముందుకేసి తమకంటే మరో ముఖ్యమైన నేతలు ఎవరున్నారని ప్రశ్నిస్తారు. మల్ రెడ్డి లాంటి వారయితే మంత్రి పదవి ఇవ్వకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు కూడా దిగుతున్నారు. ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి గెలిచి ఎన్నేళ్లయిందో ఆయనకు గుర్తుందా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. 2009 నుంచి ఆయన పోటీ చేస్తుంటే 2023లో మాత్రమే ఆయన గెలిచారు. ఆయన తనకు మంత్రి పదవి కావాలని కూర్చుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు.
ఎవరైనాఎలా పాలన చేయగలరు?
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. కోమటిరెడ్డి పార్టీలు మారినా ఆయన మునుగోడు నుంచి గెలవలేకపోయారు. కానీ తాము అన్నదమ్ములం మంత్రి వర్గంలో ఉంటే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నారు. తాము క్రికెట్ లో పఠాన్ సోదరుల వంటి వారమని ఉదాహరణ చెప్పి మరీ వారి అనుచరులతో చిటికెలు వేయించుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి కాంగ్రెస్ నేతలతో ఏ ముఖ్యమంత్రి అయినా పాలనను ఎలా సజావుగా నడపగలరన్న ప్రశ్న మాత్రం అందరిలోనూ తలెత్తుతుంది. ఆశకు హద్దుండాలి. అధినాయకత్వమే మంత్రి పదవులను నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి కేవలం కొన్ని పేర్లను మాత్రమే సిఫార్సు చేస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. తీసుకోకపోవచ్చు.
రేవంత్ మాటలను...
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ లు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఏ మాత్రం పనిచేయవన్నది అందరికీ తెలిసిందే. ఈరోజు నుంచి ఎమ్మెల్యేలను గ్రామాల్లో పర్యటించాలని చెప్పారు. జూన్ రెండో తేదీ వరకూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు. తాను కూడా మే1 తేదీ నుంచి గ్రామాల బాట పడతానని చెప్పారు. అయితే కనీసం పది శాతం మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి ఆదేశాలను ఖాతరు చేయలేదని తెలిసింది. కొందరు గ్రామాలకు వెళ్లి మమ అనిపించి వచ్చేశారు. గ్రామాలకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా రెండోసారి అధికారంలోకి రావడానికి వీలవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినా వినేవారు లేరు. లెక్క చేసేవారు లేరు. ఇక ఈ పార్టీ ఎలా బాగుపడుతుందన్నది ఆ పార్టీ నేతలకే తెలియాలి. అందుకే కాంగ్రెస్ కు శత్రువులు ప్రజలు కాదు ఆ పార్టీ నేతలేనన్నది మరోసారి రుజువయ్యేటట్లుంది.
Next Story

