Fri Dec 05 2025 16:50:46 GMT+0000 (Coordinated Universal Time)
తల్లికి కుమార్తె షాక్.. అట్లకాడతో వాతలు పెట్టి, ఒంటిపై కారం చల్లి!
మహబూబ్నగర్ పురపాలక పరిధి తిమ్మసానిపల్లిలోని అద్దె ఇంట్లో నజ్మా బేగం అనే మహిళ తన భర్త, కుమార్తెతో..

మహబూబ్నగర్ : ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని భావిస్తారు. ఇక తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఖాళీ దొరికినప్పుడు అమ్మకు ఇంట్లో చిన్నచిన్న పనులు చేసిపెడుతూ ఉంటారు ఆడపిల్లలు. ఇది ఒకప్పటి మాట. కోడళ్లకు అత్త అట్లకాడతో వాతలు పెట్టడం మనం తరచుగా సీరియల్స్, లేదా కొన్ని మూవీ సన్నివేశాల్లో చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ తల్లి తన కూతురును ఇంట్లో ఉన్న పాత్రలు కడగమన్నందుకు తల్లిపైనే అట్లకాడతో దాడికి పాల్పడి గొంతు, తలను గాయపర్చిన ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
మహబూబ్నగర్ పురపాలక పరిధి తిమ్మసానిపల్లిలోని అద్దె ఇంట్లో నజ్మా బేగం అనే మహిళ తన భర్త, కుమార్తెతో కలిసి ఉంటోంది. భర్త బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం తల్లి తన 12 ఏళ్ల కుమార్తెను వంటపాత్రలు కడగమని కోరింది. కుమార్తె ఆ పని చేయకపోవడంతో.. ఆమె కొట్టి మందలించింది. దీంతో ఆగ్రహానికి గురైన కుమార్తె అట్లకాడతో తల్లిపై దాడికి దిగింది.
తల్లి ఒంటిపై కారం చల్లింది. ఈ దాడిలో తల్లి తలకు, గొంతు భాగం వద్ద తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో చిన్నచిన్న పనులు చేయమని చెప్పినందుకు తల్లిపై ఇంత దారుణానికి పాల్పడిన ఆ యువతిని చూసి స్థానిక మహిళలు ఖంగుతిన్నారు. నేటి యువత ఆగడాలకు అంతులేకుండా పోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా ఇది తల్లులకు షాకింగ్ న్యూసే. మొత్తం మీద నేటి యువత వింతపోకడతో సమాజంలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అనడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తుందనడంలో ఆశ్చర్యం లేదు.
Next Story

