Fri Mar 06 2026 11:26:37 GMT+0530 (India Standard Time)
Summer Effect : ఈ ఏడాది ఎండల నుంచి బతికి బయటపడటం ఎలాగో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే.. చెమటలు పట్టిస్తున్నాడు. బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు. ఏప్రిల్, మే లో భానుడు మరింత భగ్గుమనే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్లో పేర్కొందని విపత్తుల సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.
మార్చినెలలోనే...
మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉందని అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కవ రోజులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. మార్చి నుంచి మే నెల వరకు చూసుకుంటే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు తెలిపారు. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ప్రాణ నష్టం జరగకుండా...
విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండతీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. జిల్లాయంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుందన్నారు. ఎండ తీవ్రత అంచనాల నేపధ్యంలో జిల్లా అధికారులు దృష్టి సారించాలని ఇప్చటికే సూచనలు జారీ చేశామన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై పర్యవేక్షిస్తామన్నారు. జిల్లా యంత్రాంగానికి రెండు రోజుల ముందుగానే ఉష్ణోగ్రత వివరాలు, వడగాల్పులు, ఎండ తీవ్రతపై సూచనలు జారీచేయనున్నట్లు చెప్పారు. రియల్ టైమ్ లో ఎండ ప్రభావం చూపే మండల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు. ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు.ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడనున్నందున చెట్ల క్రింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణలోనూ ఎండల తీవ్రత...
తెలంగాణలోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఇరవై ఐదు జిల్లాల్లో ముప్ఫయి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయని, కొన్ని జిల్లాల్లో 38 డిగ్రీలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చి నెల మొదటి వారంలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అలాగే ఉక్కపోతతో పాటు వేడిగాలులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఈ నెల రెండో వారంలో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే అవకాశముందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.అందుకే పగటి వేళ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండలకు బయటతిరగడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. డీ హైడ్రేషన్ కు గురి కాకుండా తగినం మంచినీటిని తీసుకోవాలని కోరారు.
Next Story

