Mon Apr 06 2026 11:16:25 GMT+0530 (India Standard Time)
Summer Effect : ఎండల మధ్య వానలు.. ఒకింత రిలీఫ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. రోజుకు నలభై నుంచి నలభై మూడు డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వేసవిలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. సెగ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ చిరు జల్లులు...
ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొకవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న మూడు రోజుల పాటు అక్కడకక్కడ తేలిక పాటి వానలు పడతాయని చెప్పింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని, నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీ వానలు పడతాయని చెప్పింది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయంది.
తెలంగాణలో పిడుగులు...
తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడతాయని, ప్రధానంగా పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరికొన్ని చోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశముందని చెప్పింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వేడిగాలులు, ఉక్కపోతతో ఇప్పటికే తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగిందని విద్యుత్తు శాఖ అధికారులు తెలిపారు.
Next Story

