Wed Mar 11 2026 10:54:29 GMT+0530 (India Standard Time)
Summer Effect : ఇళ్లను వదలి బయటకు రావద్దండి.. దూర ప్రయాణాలను రద్దు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇకవేడిగాలుల తీవ్రత కూడా పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఏర్పడి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండలు ముదరడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత పెరగడంతో వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. సాథ్యమయినంత వరకూ పగటి వేళ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటమే మంచిదని, ఒకవేళ అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకుని తిరిగి వీలయినంత త్వరగా ఇంటికి చేరుకోవాలని సూచిస్తున్నారు. దూర ప్రయాణాలను రద్దు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
రానున్న రెండు రోజుల్లో...
ఆంధ్రప్రదేశ్ లో నేడు పొడి వాతావరణం నెలకొని ఉంటుందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని చెప్పింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇప్పటికే నలభై డిగ్రీలు నమోదవుతున్నాయి. అంటే రానున్న రెండు రోజుల్లో నలభై మూడు డిగ్రీలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా చిరు వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే నిరంతరం నీరు సమృద్ధిగా తాగుతూ డీ హైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
వడదెబ్బ మృతులకు పరిహారం...
తెలంగాణలోనూ ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి భానుడి భగభగలు మొదలవుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఎండల తీవ్రత తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వడదెబ్బ మృతులు కూడా పెరిగే అవకాశముందని భావించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బ తగిలి మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటి వరకూ యాభై వేలు పరిహారం ఇచ్చవారు.అయితే దీనిని నాలుగు లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎండల సమయంలో అత్యవసరంగా పనిమీద బయటకు వస్తే తెలుపు రంగు దుస్తులే ధరించాలని, గొడుగు వంటి వాటితో రక్షణ కల్పించుకుని, సాధ్యమయినంత వరకూ తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story

