Mon Mar 02 2026 11:43:27 GMT+0530 (India Standard Time)
Weather Report : మార్చి నుంచే మొదలయిందే.. మూడు నెలలు మాడిపోతారంతే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు పెరిగాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గరిష్టంగా నమోదవుతున్నాయి. నిన్నటి వరకూ కొంత చలిగాలులు వీచినా ఇప్పుడు మాత్రం వడగాలులు కూడా ప్రారంభమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారతవాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్టంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, పగటి పూట గరిష్టంగా ఎండల తీవ్రత, రాత్రి వేళ ఉక్కపోత, సెగగాలులు ఈసారి బలంగా వీచే అవకాశముందని హెచ్చరించాయి. గత ఏడాది వానలు, చలి ఎంత తీవ్రతగా కనిపించిందో... ఈసారి మాత్రం ఎండలు కూడా అదేస్థాయిలో వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.
ఈ ఏడాది వేసవిలో...
బారత వాతావరణ శాఖ అధికారుల సూచనల ప్రకారం ఈ 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాయలసీమ, ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మార్చి నెలలో సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. సెంట్రల్ ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి...
ఎండతీవ్రతకు, వడగాల్పులకు గురికాకుండా తీసుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని ముందస్తు జాగ్రత్తలు రాష్ట్ర విపత్తుల నిర్వహణ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరించారు.క్యాప్, కర్చీఫ్, తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం మంచి సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. ఇంటి వాతావరణం చల్లదనం కోసం ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను వంటివి ఏర్పాటు చేసుకోవాలన్నారు.మేడపైన మొక్కలు, ఇంట్లో ని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి. ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచుకోవాలన్నారు.వంటగది తలుపులు, కిటికీలను తీసివుంచితే తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోవాలని సూచించారు.
తెలంగాణలోనూ గరిష్టంగానే...
తెలంగాణలోనూ గరిష్టంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగావడగాలులు వీచే అవకాశముందని, ఉక్కపోత కూడా మొదలవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే నిన్నటి నుంచి సెగలు .. పొగల వాతావరణం కనిపిస్తుంది.పగటి వేళ ఉష్ణోగ్రతలు 33 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయని, రానున్న కాలంలో ఇది నలభై ఐదు డిగ్రీలకు కూడా చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటించాలని, వీలయినంత మేరకు పగటి పూట బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనిచెబుతున్నారు.
Next Story

