Fri Dec 05 2025 17:50:42 GMT+0000 (Coordinated Universal Time)
TGRTC : మహిళలకు, విద్యార్థులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆధార్ కార్డులు అవసరం లేదట
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ కార్డులను ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించింది

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ కార్డులను ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించింది. తెలంగాణ ఆర్టీసీ టికెటింగ్ మరియు బస్ పాస్ వ్యవస్థను ఆధునీకరించడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రయాణాలకు స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టనుంది. మొదట ఈ సౌకర్యాన్ని విద్యార్థుల బస్ పాస్‌లతో ప్రారంభించి, తరువాత మహిళల కోసం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం లబ్ధిదారులకు విస్తరించనున్నట్లు అధికారిక వర్గాలువెల్లడించాయి. టీజీఆర్టీసీ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, బస్ పాస్‌లు పొందడం, రెన్యువల్ చేయడం మరింత సులభం కావడంతో పాటు, సంస్థ డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా ముందడుగు వేయనుంది.
విద్యార్థులకు...
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షలకుపైగా విద్యార్థి బస్ పాస్‌లు ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పటివరకు విద్యార్థులు రెన్యువల్ కోసం ప్రత్యేక కౌంటర్లకు వెళ్లాల్సి వచ్చింది. ప్రతిపాదిత స్మార్ట్ కార్డు వ్యవస్థ అమలులోకి వస్తే, వీటిని డిజిటల్‌గా రీచార్జ్ చేసుకోవచ్చు. ఇకపోతే, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో అమలులో ఉన్న స్మార్ట్ కార్డు మోడళ్లను ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, ముంబై, లక్నో వంటి మహానగరాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని తెలుసుకున్న టీజీఎస్ ఆర్టీసీ అధికారులు రాష్ట్రంలోనూ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్ధతిని, అక్కడ స్మార్ట్ కార్డులు మంజూరు చేసే విధానాన్ని అధ్యయనం చేయనుంది.
అధ్యయనం చేసిన తర్వాత...
ఆ యా రాష్ట్రంలో సమగ్ర అధ్యయనం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను గుర్తించి, తెలంగాణలో ప్రయాణికులకు అనుకూలంగా అమలు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం రాబోయే నెలల్లో దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణించడానికి మహిళలు తమ ఆధార్ కార్డులు చూపించాల్సి వస్తోంది. స్మార్ట్ కార్డులు ప్రవేశిస్తే ఈ ధృవీకరణ అవసరం ఉండదు. దీంతో ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు వినియోగించే లక్షలాది మహిళలకు మరింత సౌలభ్యం కలుగుతుందని భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నమూనాలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే స్మార్ట్ కార్డుల రూపకల్పన పై టీజీ ఆర్టీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
Next Story

