Mon Jan 19 2026 18:38:22 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతికి ఆర్టీసీ ఆదాయం ఎంతో తెలుసా?
సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది

సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండగ వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. యాభై శాతం అదనపు ఛార్జీలను వసూలు చేసి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. తిరిగి సంక్రాంతి పండగ తర్వాత హైదరాబాద్ నగరానికి చేర్చింది. అయితే ఈ నెల 9వ తేదీ నుంచి పదమూడో తేదీ వరకూ కేవలం ఐదు రోజుల్లోనే తెలంగాణ ఆర్టీసీకి 67.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
తిరుగు ప్రయాణంలో...
సగటున రోజుకు 13.48 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ అధికారులు చెప్పారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రతి రోజుకు 2.70 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభించిందని చెప్పారు. దీంతో పాటు మరొకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినప్పటికీ 67 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో 6,431 బస్సులు నడిపింది. ఇక తిరుగు ప్రయాణంలో ఎంత ఆదాయం వస్తుందన్నది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. తిరుగు ప్రయాణంలోనూ ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
Next Story

