Fri Feb 13 2026 16:32:43 GMT+0530 (India Standard Time)
Telangana : సెంటిమెంట్ కార్డుతో కారు స్పీడందుకోనట్లుందిగా?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో రాణించలేదు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. బావా బామర్దులు విస్తృతంగా చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని స్పష్టంగా అర్థమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొంత వ్యతిరేకత కనిపిస్తుందని అంచనా వేశారు. ఫార్ములా ఈ రేసు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసులో విచారణ ఇలా అన్ని సందర్భాల్లో కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలను విచారించడంతో కొంత సానుభూతి వస్తుందని ఆశించారు. సానుభూతిపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. అక్రమ కేసులు తమపై బనాయిస్తున్నా ఒక్క కేసులో నిజాలను వెలికి తీయలేకపోయారని, అరెస్ట్ చేయలేకపోయారని జనంలోకి కేటీఆర్, హరీశ్ రావులు వెళ్లారు.
అవినీతి.. విచారణలు...
మరొకవైపు బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ముందుకు రావడంతో కొంత నాయకత్వం క్షేత్ర స్థాయిలో పటిష్టం అవుతుందని ఆశించారు. అయితే బీఆర్ఎస్ నేతలు అంచనాలు మున్సిపల్ ఎన్నికల్లో విఫలమయ్యాయనే చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి అంటూ అనేక ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు నుంచే రోజుకొక అంశంపైన అవినీతి జరిగిందని బయటకు తీసుకు వచ్చారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్ నుంచి అనేక విషయాల్లో ఆరోపణలు చేశారు. ఇక కృష్ణా నీటి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలను కూడా చేశారు. కృష్ణా నది వాటాను ఈ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని తెలిపారు.
సాగు నీటి అంశాలను కూడా...
ఒక వైపు సంక్షేమ పథకాలు అమలు కాదంటూ విమర్శలు చేస్తూనే... మరొకవైపు సాగు నీటి సెంటిమెంట్ ను కూడా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం అందుకుంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై స్వయంగా కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేశారు. అయినా ప్రజలు సెంటిమెంట్ కు ఈ ఎన్నికల్లో తలొగ్గలేదన్నది ఫలితాలను బట్టి అర్థమవుతుంది. మరొకవైపు క్యాడర్ లోనూ ఇంకా సందిగ్దత నెలకొంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశం కూడా పదే పదే ప్రస్తావించినప్పటికీ ప్రజలు విశ్వసించలేదు. అయితే పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో పోలిస్తే తాము గణనీయమైన విజయాన్ని సాధించామని గులాలాబీ పార్టీ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదన్న వాస్తవాన్ని నాయకత్వం అంగీకరించి తీరాల్సిందే.
Next Story

