క్షమించమని కోరుతున్న మంత్రి తలసాని
హైదరాబాద్‌లోని ముషిరాబాద్లో జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి

హైదరాబాద్‌లోని ముషిరాబాద్లో జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ భైంసా ఏఎంసీ ఛైర్మన్ రాజేష్‌కుమార్ బాబును నెట్టేసిన ఘటన వివాదాస్పదం అయింది. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వివరణ ఇచ్చారు. జనం రద్దీ ఉన్న కార్యక్రమంలో అనుకోకుండా ఆయన బూటుతో తన కాలును తొక్కడంతో రక్తస్రావమైందని, ఆ బాధలో ముందున్న వ్యక్తిని వెనక్కి లాగానని అన్నారు. అతను గిరిజనుడు భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేష్‌కుమార్ బాబు అని తెలిసిందని, వెంటనే ఆయనకు ఫోన్ చేసి పొరపాటు జరిగిందని, క్షమాపణ చెప్పానని అన్నారు. ఈ ఘటనపై అతనితో పాటు గిరిజన సమాజానికి క్షమాపణ చెబుతున్నానని అన్నారు. కొందరు కావాలనే సామాజిక మాధ్యమాల్లో విషయం పెద్దది చేసి చూపుతున్నారని.. తాను బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు, దళిత బిడ్డలు, వెనకబడిన వర్గాలు, మైనారిటీల గొంతుకనని అన్నారు. ఎటువంటి బేషజం లేకుండా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

