Sun Dec 21 2025 13:50:30 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కార్యాచరణను సిద్ధం చేసిన గులాబీ బాస్ కాంగ్రెస్.. ఇక కాస్కో అంటున్న కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో సమావేశాలు నిర్వహించాలని నేతలను ఆదేశించారు. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడిందని కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీల వద్ద రాజీ పడిందని తెలిపారు.
మూడు భారీ బహిరంగ సభలు...
45 టీఎంసీలకు కేంద్ర ప్రభుత్వం వద్ద అంగీకరించడం పై మూడు సభలను నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. నీటి వాటాల విషయంలో బీఆర్ఎస్ రాజీ పడకుండా ప్రయత్నించినా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని అన్నారు.
పదిహేను రోజుల్లో...
మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో మూడు భారీ బహిరంగసభలను పదిహేను రోజుల్లో ఏర్పాటు చేయాలని నేతలను ఆదేశించారు. తాను కూడా ఈ సభలకు హాజరవుతానని కేసీఆర్ తెలిపారు. కరపత్రాలు, ప్రచారంతో ప్రజల వద్దకు వెళ్లాలని కేసీఆర్ అన్నారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ నీటి పంపిణీకి సంబంధించిన సమస్యలను ప్రజల్లోకి తీసుకుని మరో ఉద్యమాన్ని నిర్వహించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తాను ఇకపై జనంలోనే ఉండి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని నిర్ణయించారు.
Next Story

