Fri Dec 05 2025 05:23:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : వరద తొలిగినా వ్యాధుల ముప్ప పొంచి ఉంది.. అలెర్ట్ కావాల్సిందే
తెలంగాణను భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో వ్యాధుల వ్యాప్తి జరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

తెలంగాణను భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండటంతో పాటు క్లైడ్ బరస్ట్ జరగడంతో కొన్ని జిల్లాల్లో నీరు నిలిచిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప్రధానంగా మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. వరద నీరు ఇంకా తొలిగిపోలేదు. ఇంకా కొన్ని ప్రాంతాలు నీటిలోనే నానుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరద నీరు తొలిగిపోలేదు. కొద్దిగా శాంతించిన చోట ఇళ్లలో బురద పేరుకుపోయింది. దీంతో వ్యాధుల వ్యాప్తి జరిగే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. కలుషిత నీరు తాగడంతో పాటు దోమల కారణంగా అనేక రకాలైన వ్యాధులు వ్యాపించే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు చెబుతన్నారు.
అరవై సెంటీమీటర్ల వాన...
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు మరియు వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయి. నదులు, వాగులు, కాల్వలు ఉప్పొంగాయి. రైల్వే ట్రాక్ లు కూడా కొట్టుకుపోయాయి. పంట పొలాలల్లో ఇసుక మేట వేసింది. ఇళ్లలోకి నీరు చేరి బురద మయంగా మారింది. ఇప్పుడిప్పుడే పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు బయలుదేరిన వారు కొందరయితే మరికొందరు వరద నీటిలోనే ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు. మెదక్ జిల్లాలో రెండు రోజుల పాటు అరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందని వాతావరణ శాఖ చెప్పింది. ఇళ్లూ, వాగులూ ఏకమయ్యాయి. అయితే ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టినా వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని ఆందోళన అధికంగా ఉంది.
వరదల తర్వాత ఎక్కడైనా?
వరదల తర్వాత ఎక్కడైనా వ్యాధులు సులువుగా సంక్రమిస్తాయి.కలుషిత నీటిని తాగడం వల్ల, దోమల కారణంగా అనేక రకాల వ్యాధులు వస్తాయి. అందులోనూ పశువులు కూడా పెద్ద సంఖ్యలో మరణించడంతో జంతు కళేబరాలనుంచి వచ్చే ఇన్ ఫెక్షన్లు కూడా మనుషులకు సోకే ప్రమాదముంది. ప్రజారోగ్యం ఇప్పుడు ప్రమాదంలో పడినట్లయింది. వరద నీరు ఎక్కువ కాలం నిలిచిపోవడం వల్ల దోమల వ్యాప్తితో చికెన్ గున్యా, కలరా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సంక్రమించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వరద బాధిత ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, అలాగే రక్షిత మంచినీటిని వరద బాధితులకు కొన్ని రోజుల పాటు అందచేయాలని కోరుతున్నారు. పారిశుద్ధ్యం దెబ్బతినడం, అపరిశుభ్రవాతావరణంతో రోగాలు సంక్రమించే అవకాశముందని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
Next Story

