Fri Dec 05 2025 19:56:39 GMT+0000 (Coordinated Universal Time)
డాక్టర్ గా మారిన తమిళి సై
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ డాక్టర్ గా మారి ఒకరి ప్రాణాలను రక్షించారు. ఢిల్లీ - హైదరాబాద్ విమానంలో ఈ ఘటన జరిగింది.

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ డాక్టర్ గా మారి ఒకరి ప్రాణాలను రక్షించారు. ఢిల్లీ - హైదరాబాద్ విమానంలో ఈ ఘటన జరిగింది. తమిళి సై సౌందరరాజన్ వారణాసి వెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీ చేరుకుని ఇండిగో విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. అయితే ఆ సమయంలో ఒక ప్రయాణికుడికి ఛాతినొప్పి రావడంతో ఎయిర్‌లైన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానంలో ఎవరైనా వైద్యులు ఉన్నారా? అని అనౌన్స్ చేశారు. వెంటనే అదే విమానంలో ప్రయాణిస్తున్న తమిళి సై సౌందరరాజన్ తాను ఉన్నానంటూ ముందుకు వచ్చారు.
ప్రాధమిక చికిత్స చేసి....
ప్రయాణికుడికి అత్యవసర వైద్యాన్ని అందించారు. ప్రాధమిక చికిత్స చేశారు. దీంతో ప్రయాణికుడు ఛాతి నొప్పి నుంచి కోలుకున్నారు. విమాన సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ చికిత్స అందించడంతోనే తాను బతికి బయటపడ్డానని సదరు ప్రయాణికుడు చెప్పారు. తమిళి సై సౌందరరాజన్ స్పందించిన తీరును అందరూ అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా విమాన సిబ్బందికి తమిళి సై సౌందరరాజన్ పలు సూచనలు చేశారు. ప్రాధమిక చికిత్స అందించే కిట్ ఉండేలా చూసుకోవాలని కోరారు. అలాగే విమానంలో ప్రయాణిస్తున్న వారిలో వైద్యుల వివరాలను కూడా ముందుగా తెలుసుకోవాలన్నారు.
Next Story

