Tue Jan 14 2025 07:15:02 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : హెచ్ఎంపీవీ వైరస్ తో అలెర్ట్ అయిన తెలంగాణ సర్కార్.. మార్గదర్శకాలివే
తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది
తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయాలను తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్యం- కటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ బీ రవీందర్ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క హెచ్ఎంపీవీ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. దీని బారిన పడకుండా ఉండటానికి పలు సూచనలు ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఎంపీవీ వైరస్ సోకదని ఆయన తెలిపారు. అయితే ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొంది.
చలికాలంలో...
హెచ్ఎంపీవీ మరో రెస్పిరేటరీ వైరస్ అని, చలికాలంలో జలుబు, ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయని ఆయనతెలిపారు. ప్రత్యేకించి- చిన్నపిల్లలు, వయోధిక వృద్ధులు దీని బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కోరారు. చేయాల్సినవి- చేయకూడని వివరాలను ఈ ప్రకటనలో పొందుపరిచారు.
చేయాల్సినవి ఏవంటే?
1. దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్‌ను అడ్డు పెట్టుకోవాలి.
2. సబ్బు లేదా అల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలి.
3. గుంపుగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.
4. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు. గుంపులో తిరగకూడదు.
5. చాలినంత మంచినీళ్లు తీసుకోవాలి. పౌష్టికాహారాన్ని స్వీకరించాలి.
6. అనారోగ్యం బారిన పడినప్పుడు ఇతరులను కలుసుకోవడాన్ని తగ్గించాలి. ఇంట్లోనే ఉండాలి.
7. గాలి ధారాళంగా వచ్చేలా చేసుకోవాలి.
8. కంటి నిండా నిద్రపోవాలి.
చేయకూడనివి..
1. ఇతరులకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు.
2. ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లు, హ్యాండ్ కర్చీఫ్ లు మళ్లీ వాడకూడదు.
3. అనారోగ్యంతో బాధపడుతున్న వారితో దూరంగా ఉండాలి.
4. తరచూ కంటిని నలుపుకోవడం, ముక్కు, నోటిని చేత్తో తుడుచుకోవడాన్ని మానుకోవాలి.
5. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు.
6. డాక్టర్‌ను సంప్రదించకుండా సొంతంగా ఎలాంటి మందులూ వాడకూడదు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story