Tue Apr 29 2025 08:56:52 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : రేపు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ.. పడకుంటే మీరు ఇలా చేయొచ్చు
తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను నేటి నుంచి రాష్ట్రంలో అమలు చేసింది

తెలంగాణ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలను నేటి నుంచి రాష్ట్రంలో అమలు చేసింది. ఎంపిక చేసిన గ్రామాల్లో ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ గ్రామంలో ఉన్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్దిదారులందరికీ గుడ్ న్యూస్ అందనుంది. ప్రధానంగా రేషన్ కార్డులు కావాల్సిన లబ్దిదారులకు నేటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు.ఇక ఇందిరమ్మ ఇళ్లు మంజూరయిన వారికి మంజూరయిన లేఖలను కూడా నేటి నుంచి ఇవ్వనున్నారు. ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు ఎంపికయిన లబ్దిదారులకు మాత్రం రేపటి నుంచి నిధులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.
ఆదివారం కావడంతో...
ఈరోజు ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు దినం కావడంతో రేపటి నుంచి బ్యాంకుకు వెళ్లి రైతుభరోసా, ఆత్మీయ భరోసా కింద ఆరు వేల రూపాయల నగదు జమ అయిందా? లేదా? అన్నది తెలుసుకునే వీలుంది. ఈరోజు చెక్కులు పంపిణీ చేయడంతో రేపు వాటిని బ్యాంకులో జమ చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన వారికి కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో రేపు చెక్కులను బ్యాంకులో వేసుకుని వాటిని నగదుగా మార్చుకున్నతర్వాత ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించుకోవచ్చు. మంచిముహూర్తాలు కూడా గురువారం నుంచి ప్రారంభం కానుండటంతో ఇక ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించుకునే వీలుంది. తొలి విడతగా సొంత జాగా ఉన్న వారికి మాత్రమే ఇవ్వడంతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకోవడం వెంటనే వీలవుతుంది.
అర్హులయిన వారందరికీ...
అయితే రైతు భరోసా, ఆత్మీయ భరోసాకు సంబంధించిన నిధులు మాత్రం అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో రేపటి నుంచి ఒక్కొక్కరికి తొలి విడతగా ఆరువేల రూపాయలు జమ అవుతాయి. అయితే రేపు నగదు జమ కాకుంటే వెంటనే మండలంలోని అధికారిని సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఈ నాలుగు పథకాలకు సంబంధించి ఇప్పటికే అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులైన లబ్దిదారులను గుర్తించేందుకు, అంటే వడపోత పోసేందుకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. అందువల్ల దరఖాస్తు చేసుకున్న వారందరికీ మార్చి 31వతేదీ వరకూ నగదు జమ కాకపోయినా, సంక్షేమ పథకాలు అందకపోయినా వెంటనే సంబంధింత అధికారిని సంప్రదించి అందుకు గల కారణాలను తెలుసుకునే వీలుంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇది నిరంతర ప్రక్రియ అని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
Next Story