Fri Feb 20 2026 19:50:55 GMT+0530 (India Standard Time)
Telangana Congress : కాంగ్రెస్ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఎవరంటే?
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది

తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 16న పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ మను సింఘ్వీతో పాటు, బిఆర్ఎస్ సభ్యుడు కె.ఆర్. సురేష్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఈ రెండు స్థానాల కోసం పోటీ ప్రారంభమయింది. ఇప్పటి వరకూ సీనియర్ నేతలను పట్టించుకోలేదని, ఈసారైనా పార్టీ విధేయులకు రాజ్యసభర స్థానాలను ఇవ్వాలన్న డిమాండ్ ఎక్కువగా వినపడుతుంది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పార్టీకోసం కష్టపడిన వారికి ఇప్పటి వరకూ ఛాస్స్ ఇవ్వకపోవడాన్ని తప్పు పడుతుంది.
బలాబలాల ప్రకారం...
శాసనసభలో ప్రస్తుత పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకునేలా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల గెలుపు లెక్కల ప్రకారం, రెండు స్థానాలు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కో అభ్యర్థి గెలవడానికి దాదాపు 40 నుంచి 41 మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్కు ఉన్న 64 మంది స్వంత ఎమ్మెల్యేలతో పాటు, ఇతర పార్టీల నుండి చేరిన వారితో కలిపి మొత్తం బలం 75 దాటడంతో, ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవడానికి అవసరమైన 82 ఓట్లకు కాంగ్రెస్ అత్యంత సమీపంలో ఉంది. మజ్లిస్ మద్దతు ఎటూ కాంగ్రెస్ పార్టీకే లభిస్తుంది. అందుకే రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది.
ఒకరికే అవకాశమా?
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పరిస్థితి ఈ ఎన్నికల్లో కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న 27 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఒక సీటు గెలవడానికి కూడా సరిపోదు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఓటింగ్ కు హాజరు కాకపోవచ్చు. పైగా, రెండో ప్రాధాన్యత ఓట్ల విషయంలోనూ అధికార పక్షానికే స్పష్టమైన ఆధిక్యం ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టినా పోటీ ఇవ్వడం కష్టమే. కాంగ్రెస్ అధిష్టానం ఒక సీటును జాతీయ స్థాయి నేతకు, మరో సీటును సామాజిక సమీకరణాల దృష్ట్యా రాష్ట్ర స్థాయి నేతకు కేటాయించే అవకాశం ఉంది. అయితే ఆ ఒక్క సీటు ఎవరికి అన్నది ఇంకా తేలలేదు. జగ్గారెడ్డి మాత్రం వీహెచ్ కు, కుసుమ కుమార్ లకు ఇవ్వాలంటూ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే పార్టీ భవిష్యత్ ప్రయోజనాలు, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అంటున్నారు. మరి ఆ ఒక్కరు ఎవరో?
Next Story

