Mon Mar 16 2026 19:45:33 GMT+0530 (India Standard Time)
Telangana : కాంగ్రెస్ లో అసంతృప్తి బయటపడే అవకాశాలు ఎంత?
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి అనేది బయటపడకుండా ఉం

తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి అనేది బయటపడకుండా ఉంది. అయితే ఎన్నికలు దగ్గర పడే సమయంలో అది మరింత బయటపడే అవకాశముందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అప్పర్ హ్యాండ్ గానే ఉంది. ఢిల్లీ హైకమాండ్ వద్ద కూడా ఆయనకు తిరుగులేదు. ఎన్ని ప్రచారాలు జరిగినప్పటికీ రేవంత్ రెడ్డి విషయంలో ఢిల్లీ నాయకత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా సీనియర్ నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఎదిరించి ఏమీ చేయలేమని...
కానీ అది బయట పడేంత మాత్రం లేవన్నది వాస్తవం. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎదిరించి ఇప్పుడు సాధించేదేమీ ఉండదని అందరికీ తెలుసు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఇక పార్టీ నుంచి సర్దేసుకుంటున్నప్పటికీ, చాలా మంది అసంతృప్తి నేతలు తమకు భవిష్యత్ లోనూ పదవులు రావన్న ఆందోళనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒంటిచేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. అందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను పదేళ్ల పాటు ప్రజలు కాదన్నప్పటికీ రేవంత్ రెడ్డి వ్యూహాలు, అనుసరించిన విధానాలతోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతగా చూసేందుకు కొందరు ఇష్టపడకపోవడంతోనే ఈ సమస్య ఉందని చెబుతున్నారు.
సీనియర్ నేతలను కలుపుకుంటూనే...
అయితే అది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం పాళ్లు చాలా ఎక్కువ. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీ అయిన బీజేపీ తరహా లాంటిది కాదు. ఎవరి లాబీయింగ్ వారికి ఉంటుంది. ఢిల్లీ స్థాయిలో అందరికీ సంబంధాలున్నాయి. అయితే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్లు కూడా సమయం కోసం వేచి చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే సీనియర్ నేతలను కలుపుకుని వెళుతూనే తాను అనుకున్నది చేసుకుంటూ వెళుతుండటంతో ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని, అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ నేతలు ఇక ఊరికే ఉండరని, చికాకు తెప్పించడం ఖాయమన్న కామెంట్స్ సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. మరి పదేళ్ల పాటు అధికారం తమదేనంటున్న రేవంత్ రెడ్డి నేతలను ఎలా కంట్రోల్ లో పెడతారో చూడాలి.
Next Story

