Fri Dec 05 2025 09:06:53 GMT+0000 (Coordinated Universal Time)
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ కాబినెట్ తాజా నిర్ణయం
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించింది

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వివరించారు. 2016లో మొదలయిన ప్రాజెక్టులను 2019లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చామని కేసీఆర్ చెప్పారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రమాదంలో ప్రాజెక్టు పడిందని అనేక సంస్థలు విచారణ చేసి నివేదికలు ఇచ్చాయని, డిజైన్, ఆపరేషన్, మెయిన్ టెనెన్స్ లో లోపాలున్నాయని గుర్తించాయని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ను నియమించామన్నారు. 14.03.2024 న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేశామని రేవంత్ తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో...
665 పేజీల కమిషన్ నివేదికను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించామన్న రేవంత్ రెడ్డి ఊరు మార్చి, పేరు మార్చి, అక్రమాలకు పాల్పడిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు కూలిపోయిందని, దీనికి బాధ్యులైన ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమేయం పై కమిషన్ నివేదికలో చర్చజరిగిందన్నారు. ఈ కమిషన్ రిపోర్టును అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించామన్నారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కమిషన్ నివేదికపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకు వెళుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశాల్లో అందరి అభిప్రాయాలను తెలుసుకుంటామని చెప్పారు.
పునాదుల్లోనే లోపాలు...
తొలుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో చాలా లోపాలున్నాయని ఎన్డీఎస్ఏ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పేర్కొందని అన్నారు. డిజైన్, ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణంలో లోపాలున్నాయని కమిషన్ చెప్పిందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల పునాదుల్లోనే లోపాలున్నాయని తెలిపింది. రుణాలు తీసుకొచ్చే విషయంలోనూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పారు. ప్రజాధనాన్నికాంట్రాక్టరుకు కట్టబెట్టడానికి ప్రాజెక్టు అంచనాలను రివైజ్ చేశారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసిందని తెలిపారు. రాజకీయ కక్షలు కాదని, వ్యక్తిగత కక్షలుకు తావివ్వకుండానే కమిషన్ నివేదికను చర్చకు పెట్టడం జరిగిందన్నార.
అధిక వడ్డీలకు రుణాలను తెచ్చి...
అధిక వడ్డీలకు ఎనభై నాలుగు వేలకోట్ల రూపాయలను రుణాలుగా తెచ్చారన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడంలో కేసీఆర్ దే కీలక పాత్ర అని కమిషన్ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లేదని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తెలిపింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో తొమ్మిది సార్లు హరీశ్ రావు పేరు ప్రస్తావించారన్నారు. జలవనరుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం చేయడంపైనే పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతెలిపారు. భారీ స్థాయిలో అవినీతి జరిగిందని కమిషన్ తేల్చిందని భట్టి విక్రమార్క తెలిపారు.
Next Story

