Tue Feb 24 2026 09:39:20 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే.. ఉద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు, పింఛనుదారుల కోసం కొత్త పథకాలను ప్రకటించింది. ఉద్యోగుల కోసం 1,056 కోట్ల రూపాయలతో మూలధనం ఏర్పాటు చేసి వారికి ఆరోగ్య పథకానికి అవసరమైన నిధులను కేటాయించనుంది. 1.20 కోట్ల ప్రమాద బీమాను వర్తింప చేయాలని నిర్ణయించింది. ఉద్యోగులు, పింఛను దారుల కోసం ఈ ఆరోగ్య పథకాన్ని రూపొందించింది. దీనికి మంత్రి వర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. అలాగే ఆరోగ్య సేవలను పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు 652 ప్రయివేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించనున్నారు. 1,998 వ్యాధులకు క్యాష్ లెస్ చికిత్సలను అందచేయనున్నారు. దీంతో ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి వర్గ సమావేశం ద్వారా సంకేతం పంపింది.
ఉద్యోగ బీమా...
దీంతో పాటు ఉద్యోగులకు దేశంలో ఎక్కడా అమలు చేయని విధంగా ప్రమాద బీమా కల్పించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఉద్యోగులు, పింఛనుదారుల నుంచి ఒక్క రూపాయి కూడా ప్రీమియం తీసుకోకుండా ప్రమాదంలో మరణిస్తే 1.20 కోట్ల పరిహారం అందించేలా బీమా సౌకర్యాన్ని కల్పించనుంది. అరవై ఏళ్ల వరకూ ఉద్యోగులకు పది లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని మంత్రి వర్గ సమావేశం అనంతరం మంత్రులు తెలిపారు. మొత్తం 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2.38 లక్షల మంది పింఛనుదారులకు ఈ ప్రమాద బీమా వర్తించనుంది. ఉద్యోగులు, ప్రభుత్వంపై భారం లేకుండా బ్యాంకుల ద్వారానే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మెట్రో రైలును...
హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం తీసుకునేందుకు మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలను తెచ్చేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ సలహాదారులుగా ప్రముఖ వైద్యులు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ శ్రీనాధ్ రెడ్డిని కమిటీలో నియిమించి ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై అధ్యయనం చేయాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు కూడా మంత్రి వర్గ సమావేశం ఆమోదించింది. రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం 223.09 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.
Next Story

