Mon Dec 15 2025 05:48:27 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ... ఆ ముగ్గురికి పిలుపు వచ్చిందట
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ నేడు జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం రాజ్ భవన్ లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ నేడు జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం రాజ్ భవన్ లో నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హుటాహుటిన బయలుదేరివస్తున్నారు. నిన్న రాత్రికి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇప్పటికే తెలంగాణ నేతలకు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎవరెవరిని కేబినెట్ లో తీసుకోవాలన్న దానిపై నిన్న రాత్రి పొద్దుపోయే సమయానికి నిర్ణయించారు. మాదిగ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రేపు మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలంతా అందుబాటులో ఉండాలని చెప్పడంతో పాటు ఒకరికి కేబినెట్ లో చోటు కల్పిస్తామని మాట ఇవ్వడంతో మాదిగ సామాజిక వర్గానికి ఒక పోస్టు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీరికి అవకాశం ఇస్తే...
మాదిగలకు అవకాశం కల్పిస్తే ఇక సీనియర్ నేత గడ్డం వివేక్ కు ఛాన్స్ దక్కకపోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ముగ్గురు లేదా నలుగురి నుంచి మాత్రమే కేబినెట్ లోకి తీసుకునే అవకాశముండటంతో మరో విడత అవకాశం కల్పించే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ముగ్గురిలో ఒకరు బీసీ సామాజికవర్గానికి చెందిన వాకిటి శ్రీహరి పేరు కన్ఫర్మ్ అయినట్లు తెలిసింది. అయితే నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో సుదర్శన్ రెడ్డి పేరును కూడా సీరియస్ గానే పరిశీలించి ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటారా? లేదా తెలియాల్సి ఉంది. సీనియర్ నేత సుదర్శన్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తారని భావించి పక్కన పెట్టింది. . అయితే మాల నియోజకవర్గం నుంచి మాల వర్గం సామాజివర్గానికి చెందిన గడ్డం వివేక్ కు, మాదిగ సామాజికవర్గానికి చెందిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం కల్పించినట్లు తెలిసింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించినట్లయింది.
ముగ్గురయితే వీరు...
ముగ్గురిలో ఒకరు మాల, మరొకరు మాదిగ, ఇంకొకరు ముదిరాజ్ సామాజికవర్గం నుంచి కేబినెట్ లో భర్తీ చేస్తారంటున్నారు. అయితే ఇద్దరిని ప్రస్తుతం ఉన్న కేబినెట్ నుంచి తప్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. రెండేళ్లు పూర్తి కావస్తుండటంతోఇద్దరిని తప్పించి వారి స్థానంలో కొందరికి అవకాశం కల్పించాలని నిర్ణయించినా దీనిపై ఇంకా హైకమాండ్ నుంచి నిర్ణయం రాలేదని తెలిసింది. తెలంగాణ కేబినెట్ లో మొత్తం ఆరు ఖాళీలున్నాయి. అందులో ముగ్గురికి అవకాశం కల్పిస్తే మరో మూడు ఖాళీగా ఉంటాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన విద్యాశాఖ, హోంశాఖ ఉండటంతో పాటు కొంతపనిభారం తగ్గించాలని ఈ మేరకు మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story

