Mon Dec 08 2025 09:58:10 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ కు అడ్డు అదేనా?
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేటట్లు కనిపించడం లేదు

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో జరిగేటట్లు కనిపించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఇంకా ఆరు పోస్టులు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నాయి. కీలకమైన శాఖలను కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. విద్యాశాఖతో పాటు ముఖ్యమైన హోంమత్రిత్వ శాఖ కూడా రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అనేక నెలల నుంచి ఆయన బాధ్యతలను చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఒకవైపు పెట్టుబడుల కోసం దేశాల పట్టుకుని తిరుగుతూ, మరొక వైపు ఇన్ని కీలక బాధ్యతలను నిర్వర్తించడం కష్టంగా మారింది. కానీ హైకమాండ్ నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇంత వరకూ రాలేదు.
ఎక్కువ మంది ఆశావహులు...
దీనికి కారణాలు కాంగ్రెస్ నాయకులే. ఎక్కువ మంది ఆశావహులు ఉండటమే కారణమని తెలిసింది. గత ఎన్నికలకు ముందు అనేక మందిని పార్టీలో చేర్చుకుని నాడు ఇచ్చిన హామీ లను అమలు చేయాలని వారు కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎక్కువ మంది రెడ్డి సామాజికవర్గం నేతలు కేబినెట్ లో స్థానం కల్పించాలంటూ వత్తిడి తెస్తుండటంతో ఒకే సామాజికవర్గానికి ఇవ్వడం మంచిది కాదన్న అభిప్రాయంలో హైకమాండ్ ఉంది. అదే సమయంలో కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం కూడా కష్టమన్ననిర్ణయానికి వచ్చింది. మరోవైపు ప్రాంతాల వారీగా కూడా పోటీ ఏర్పడింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలు తమకు కేబినెట్ లో అవకాశం కల్పించాలంటూ వినతి పత్రాలు సమర్పించారు.
అసంతృప్తి పెరుగుతుందని...
మంత్రి వర్గ విస్తరణ చేపడితే నేతలలో అసంతృప్తి పెరుగుతుందని భావించిన హైకమాండ్ ఆ నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేసినట్లు తెలిసింది. ఒకవేళ మంత్రి వర్గంలో చోటు దక్కకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న అనుమానం కూడా హైకమాండ్ లో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఎక్కువ మంది ఆశలు పెట్టుకోవడం, వారిలో సీనియర్ నేతలు ఎక్కువగా ఉండటంతో పాటు కొందరు రాజీనామాలు చేస్తామని బెదిరించడం కూడా వాయిదా పడటానికి కారణాలు అని చెబుతున్నారు. దీంతో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణకు అవకాశం లేదని హస్తిన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే అందరినీ ఒప్పించి, రెండున్నరేళ్ల తర్వాత కానీ మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
Next Story

