Sat Mar 28 2026 20:16:04 GMT+0530 (India Standard Time)
BJP : తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్లాన్ సిద్ధం చేసిందటగా?
తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది

తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఒకరకంగా చెప్పాలంటే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించింది. నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలుత నాయకుల మధ్య సమన్వయం సాధించాలని ఇటీవల నాయకత్వం నుంచి ఆదేశాలు అందాయి. గత కొన్ని రోజుల నుంచి బీజేపీలో రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరికి వారే తమ దారిలో వెళుతున్నారు. క్యాడర్ లో ఇది ఒకింత ఆందోళనకు గురి అవుతుంది.
కేంద్ర మంత్రులుగా ఉన్నా...
కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయం కుదర్చలేకపోతున్నారు. దీంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జికి ఈ బాధ్యతను అప్పగించారు. ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ లు తమ జిల్లాలు, తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు తప్పించి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన వారిలో లేదన్నది క్యాడర్ లో కూడా కలుగుతున్న భావన. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. తాము రాష్ట్రంలో పర్యటించాల్సి వస్తే అందుకు నాయకత్వం నుంచి అభ్యంతరాలు వస్తాయేమోనన్న భావన కూడా ఉండి ఉండవచ్చు.
సమన్వయ కమిటీని...
వీళ్లందరి మధ్య సమన్వయం కుదిర్చేందుకు త్వరలోనే కేంద్ర నాయకత్వం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు త్వరలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు కానున్నట్లు పార్టీలో పెద్దయెతున్న ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైఫల్యాలను గుర్తించిన నాయకత్వం రానున్న జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఆ రకమైన తప్పులు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేసేలా స్థానిక నేతలతోనూ ఒక కమిటీని నియమించాలన్న ఆలోచనలో ఉంది. అప్పుడే పార్టీ క్యాడర్ లో భరోసా ఉంటుందని కేంద్ర నాయకత్వం భావిస్తుంది.
Next Story

