Thu Feb 19 2026 04:01:56 GMT+0530 (India Standard Time)
BJP : బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఫల్యానికి అసలు రీజన్ ఇదేనా?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారింది

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారింది. బీఆర్ఎస్ కు కేవలం పదిహేను శాతం ఓట్లు మాత్రమే లభించాయి. అయితే నేతల మధ్య సమన్వయం లేమి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. సాధారణంగా బీజేపీలో గ్రూపులుండవు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం నేతలు గ్రూపులుగా విడిపోయి పార్టీకి ఇబ్బంది కరంగా మారారన్న విమర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఈ గ్రూపు రాజకీయాలను గత కొన్నాళ్లుగా గమనిస్తుంది. అనేక సార్లు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం కనిపించడం లేదని అర్థమై ఇక "ఆపరేషన్ కమలం" కు సిద్ధమయిందన్నది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరొకవైపు జనసేన పార్టీతో పొత్తు అని ప్రకటించడం కూడా ఫలితాలపై ప్రభావం చూపిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
బలంగా ఉండాల్సిన సమయంలో..
శాసనసభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలుచుకున్న తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అంటే దాదాపు యాభైకి పైగా నియోజకవర్గాల్లో బీజేపీ బలంగా ఉండాల్సి ఉంది. కానీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తే మాత్రం అలా కనిపించడం లేదు. ఎనిమిది పార్లమెంటు స్థానాలను గెలిచిన పార్టీయేనా? ఇది అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. రాష్ట్రంలో అధికారానికి ప్రత్యామ్నాయం తామే అని గట్టిగా వినిపించే బీజేపీ నేతల మాటలకు, క్షేత్రస్థాయిలో వస్తున్న ఫలితాలకు మధ్య పొంతన లేకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధించే సత్తా ఉన్న పార్టీ, స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి కేవలం ఓట్ల శాతం పెంచుకోవడానికే పరిమితమవ్వడానికి కారణం వ్యూహాత్మక లోపాలేనన్నది పార్టీ సీనియర్ నేతల అంచనాగా ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ చేతికి అందడం స్వల్ప ఊరట. మున్సిపల్ ఎన్నికల్లో 261 వార్డుల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. ఏడు కార్పొరేషన్లలో 77 డివిజన్లలో గెలిచింది. కరీంనగర్, నిజామాబాద్ లోనే కొంత అనుకూల ఫలితాలు వచ్చాయి.
ఇన్ని గ్రూపులా?
పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ఇమేజ్ , జాతీయ అంశాల మీద బీజేపీ గెలుపు గుర్రం ఎక్కగలిగింది. కానీ, మున్సిపల్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి స్థానిక సమస్యలు, అభ్యర్థుల బలం , క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ముఖ్యం. ఇక్కడే బీజేపీ విఫలమవుతోంది. అవకాశం ఉన్నప్పుడు స్థానిక కమిటీలను బలోపేతం చేసుకోవడంలో, ప్రజలతో మమేకమవ్వడంలో పార్టీ నేతలు విఫలమవుతున్నారు. ఫలితంగా ఓట్ల శాతం పెరిగినప్పటికీ, అది గెలుపు సాధించేందుకు అవసరమైన స్థానాలను మాత్రం సాధించలేదు. ఇది వ్యూహాత్మక తప్పిదమేనని అంటున్నారు. అంతర్గత కలహాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో లెక్కగట్టడం కష్టమన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సీనియర్లకు, కొత్తగా చేరిన వారికి మధ్య సమన్వయం లేకపోవడం, ఎవరికి వారు తామే పవర్ఫుల్ అని చాటుకోవాలనే తపన పార్టీ ఎదుగుదలను దెబ్బతీస్తోంది. ఈ గ్రూపు తగాదాల వల్ల పార్టీ కేడర్ అయోమయానికి గురవుతోంది. ఇప్పటికైనా కేంద్ర నాయకత్వం చర్యలకు దిగితే తప్ప తెలంగాణ బీజేపీ వచ్చే శాసససభ ఎన్నికలకు కోలుకోలేదు.
Next Story

