Fri Dec 19 2025 14:19:17 GMT+0000 (Coordinated Universal Time)
Telangana BJP : మోదీ క్లాస్ దెబ్బకు దిగి వచ్చిన నేతలు.. ఒక్కటయ్యారా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్న తెలంగాణ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్న తెలంగాణ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తో సమానంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి హైదరాబాద్ మేయర్ పీఠాన్నిచేపట్టాలని కసితో ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తుంది. ఇందుకోసం తెలంగాణలో బీజేపీకి ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ, స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టిన బీజేపీ నాయకులు ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సత్తా చాటాలని చూస్తోంది. ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ లో ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు సమావశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు లోక్ సభ, రాజ్యసభ్యులు పాల్గొన్నారని తెలిసింది.
ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని...
అందుకు ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని ముందు నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. స్థానికంగా బలమైన అభ్యర్థులను గుర్తించడం, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణలో పార్టీ బలాన్ని పెంచేందుకు కలిసి పనిచేయాలని బీజేపీ ఎంపీలు నిర్ణయించారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీలు, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ‘ప్రత్యేక వ్యూహం’ అమలు చేయాలని వారు తీర్మానించారు. అభ్యర్థుల ఎంపిక కీలకం కావడంతో ఆయా నియోజకవర్గాల బాధ్యుల అభిప్రాయాలతో పాటు క్యాడర్ బలపర్చిన వారికే పెద్ద పీట వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
సరైన అభ్యర్థులను...
పార్టీ పనితీరుపై మోదీ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన పార్లమెంటు సభ్యులు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అవసరమైన శక్తియుక్తులను కూడదీసుకుని సమన్వయంతో పనిచేయాలని అందరూ అభిప్రాయపడ్డారు. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, నిన్న రాత్రి ఢిల్లీలో కిషన్రెడ్డి నివాసంలో ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మార్గాలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రామ్చందర్రావు మార్గదర్శకత్వంలో పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు సహా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని ఎంపీలు నిర్ణయించారు.
Next Story

