Fri Mar 13 2026 11:13:48 GMT+0530 (India Standard Time)
Weather Report : కూల్.. న్యూస్.. తర్వాత మాత్రం మాడు పగిలిపోతుందట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మార్చి నెల మొదటి వారం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం పది గంటలకే ఎండలు మండిపోతుండటంతో.. మధ్యాహ్నం వేళ జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వేసవి తాపం ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్న తరుణంలో.. తెలంగాణ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎండల తీవ్రత తగ్గి.. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
పదిహేను తర్వాత...
మార్చి 14 వరకు ఎండలు ఇలాగే కొనసాగుతాయి. మార్చి 15 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రారంభమవుతాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి 16, 17 తేదీల్లో కూడా రాష్ట్రంలోని పలుచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అకాల వర్షాల వల్ల ఎండల నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ.. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత గరిష్ట స్థాయికి చేరుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోనూ ఎండలు...
తెలంగాణలోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ఆదిలాబాద్ ఎండలతో భగ భగ మండుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో వేసవి ఆరంభంలోనే భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలోనే 38.5డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే ఎండలు మండుతుండడంతో బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. ఎండ తీవ్రత కారణంగా ప్రధాన రహదారులు జన సంచారం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఏసీలు, కూలర్లు, చల్లని పానీయాలను ఆశ్రయిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరు తాగాలని, కాటన్ దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
Next Story

