Wed Oct 16 2024 04:26:16 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Congress : ముఖ్యమంత్రి మారతారా? ఉత్తమ్ సీఎం అవుతారా? అసలు పార్టీలో ఎందుకు ఈ చర్చ మొదలయింది?
మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ ముఖ్యమంత్రిగా చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం అనేక మంది ప్రయత్నిస్తుంటారు. పార్టీలో సీనియర్ నేతల దగ్గర నుంచి సామాజికవర్గాల వారీగా లీడర్లు ఢిల్లీలో లాబీయింగ్ ఉపయోగించి ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అనుకుంటారు. అది సహజం. ప్రాంతీయ పార్టీల్లో ముఖ్యమంత్రి పదవి ఆశించడం కుదరదు. అది అత్యాశే. కానీ జాతీయ పార్టీలో మాత్రం ఎవరికైనా సాధ్యమే. ఏదైనా జరగొచ్చు. అందుకు కారణం హస్తనలో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపితే వారే ముఖ్యమంత్రి పదవిని చేపడతారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం పాళ్లు ఒకింత ఎక్కువ కావడంతో అది మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
రెండున్నరేళ్ల తర్వాత...
ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ముఖ్యమంత్రి మార్పిడి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డిని రెండున్నరేళ్ల తర్వాత ఆ పదవి నుంచి తప్పించి సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యంత దురదృష్టవంతుడు. పీసీసీ చీఫ్ గా ఉన్న రెండు టర్మ్ లు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. దీంతో ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. దీంతో దూకుడు మీదున్న రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా చేసింది. రేవంత్ అడుగుపెట్టిన వేళావిశేషమో, బీఆర్ఎస్ పై వ్యతిరేకతో తెలియదు కాని కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది.
గాంధీ కుటుంబంతో...
దీంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎంతమంది సీనియర్ నేతలు పోటీ పడినా రేవంత్ వైపు పార్టీ హైకమాండ్ మొగ్గు చూపింది. తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందన ఆశించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాశకు గురయ్యారు. ఆయన మంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ రిలేషన్ తోనే ఉత్తమ్ ను ఈ టర్మ్ లో ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఇటీవల ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా అద్దం పడుతున్నాయి.
శపథం నెరవేరలేదా?
ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా అవుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం ఇప్పుడు పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అందుకే ఉత్తమ్ గడ్డం తీయలేదంటున్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత తాను గడ్డం తీస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం చేశారు. అయితే ఇంతవరకూ ఆయన గడ్డం తీయకపోవడంపై కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. కానీ రేవంత్ ను తొలగించే సాహసాన్ని హైకమాండ్ చేస్తుందా? అన్నదే ప్రశ్న. ఎందుకంటే రేవంత్ పార్టీలో బలంగా పాతుకుపోయారు. ఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉంటున్నారు. వారిని తరచూ కలుస్తూ గ్యాప్ లేకుండా చూసుకుంటున్నారు. మరి ఉత్తమ్ ఆశలు నెరవేరుతాయా? కోమటిరెడ్డి జోస్యం ఫలిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story