Sat Jan 31 2026 03:48:27 GMT+0000 (Coordinated Universal Time)
నదిలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను రక్షించిన ఎస్సై
అది గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆయనను తాడు సాయంతో లాగేందుకు వెళ్లిన ఆ ఇద్దరూ కూడా నది ప్రవాహంలో..

పోలీస్ యూనిఫామ్ ధరించే వ్యక్తుల్లో కర్కశత్వమే కాదు.. పదిమందికి సహాయం చేసే మానవత్వం కూడా ఉంటుంది. పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్న ఘటనలు ఎన్నో మరెన్నో. వారి విధులు నిర్వహిస్తూనే ప్రజలకు ఎప్పటికప్పటికీ సహాయపడుతూ వారి మన్ననలు పొందుతున్నారు. ఇటువంటి సంఘటన అదిలాబాద్ జిల్లాలో కూడా చోటుచేసుకుంది. గోదావరి వరద నీరులో చిక్కుకున్న ఓ ముగ్గురు వ్యక్తులను ఎస్సై ఎంతో చాకచక్కగా వ్యవహరించి వారిని ఒడ్డుకు తీసుకువచ్చి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని వడూర్ సమీపంలో ఉన్న పెన్ గంగా నదిలోపడవ ను ఒడ్డుకు చేర్చేందుకు ఓ గంగ పుత్రుడు వెళ్లాడు. కానీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అక్కడే చిక్కుపోయాడు. అది గమనించిన ఇద్దరు వ్యక్తులు ఆయనను తాడు సాయం తో లాగేందుకు వెళ్లిన ఆ ఇద్దరూ కూడా నది ప్రవాహంలో చిక్కుకుపోయి బయటకు రాలేకపోయారు. ఈ ముగ్గురు ఒక చిన్న చెట్టును ఆధారంగా చేసుకుని అక్కడ నిలిచిపోయారు. విషయం తెలిసిన వెంటనే ఎస్సై రాధిక నది వద్దకు చేరుకొని ఎంతో చాకచక్యంగా వ్యవహరించి జాలరి తోడ్పాటుతో టైరు కి తాడు కట్టించి నదిలో చిక్కిన ముగ్గురిని సురక్షితంగా బయటకు లాగించారు. ఆ ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో గ్రామస్తులు మరియు పోలీసులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎస్సై రాధిక సమయస్ఫూర్తితో స్పందించడంతో ఆ ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారంటూ గ్రామస్తులు ఎస్సై పై ప్రశంసల వర్షం కురిపించారు.
వరద ఉధృతి దృష్ట్యా గ్రామస్తులు ఎవ్వరు కూడా నది వైపు వెళ్లవద్దని పోలీసులు సూచించారు. ఇదిలా ఉండగా మరోవైపు మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని పుసాయి ఎల్లమ్మ ఆలయంలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వరద నీరు ఆలయం లోనుంచి ఉదృతంగా ప్రవహిస్తున్నది. ఎవ్వరు కూడా గుడి పరిసర ప్రాంతాలకు వెళ్ళకూడదని పోలీసులు హెచ్చరించారు.
.
Next Story

