రోడ్లు బాగుచేయండంటూ.. 145 కిలోమీటర్లు ప్రయాణం
రోడ్లు బాగు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా కొన్ని కొన్ని సార్లు ఎలాంటి ఫలితం ఉండదు

రోడ్లు బాగు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా కొన్ని కొన్ని సార్లు ఎలాంటి ఫలితం ఉండదు. నిరసన గళం వినిపిద్దామని అనుకుంటే ఏ పెద్దాయనకు కోపం వస్తుందో, ఏ పార్టీ నేతకు ఆగ్రహం వస్తుందో అని జంకుతూ ఉంటారు. కొందరు చూసీ చూడకుండా గుంతల రోడ్ల మీద వెళ్ళిపోతూ ఉంటారు.
అయితే నల్గొండ జిల్లా పెద్ద సూరారానికి చెందిన ఆటోడ్రైవర్ భీమనబోయిన జానయ్య మాత్రం నిరసన గళాన్ని తనదైన శైలిలో వినిపించారు. గ్రామాల్లోని రోడ్లన్నీ గుంతలమయమై ఉన్నాయని, రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయని జానయ్య చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాలకు అనుసంధానంగా నిర్మించిన రోడ్లు అధ్వానంగా మారాయని జానయ్య బాధను వ్యక్తం చేస్తున్నారు. తోటి ఆటో డ్రైవర్లు పడుతున్న కష్టాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు సైకిల్‌కు ఫ్లెక్సీలు కట్టుకొని తన గ్రామం నుంచి సచివాలయానికి వచ్చారు. ఆదివారం సైకిల్ యాత్ర ప్రారంభించి మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. మూడు రోజుల్లో సుమారు 145 కిలోమీటర్లు ప్రయాణించారు జానయ్య.

