Fri Dec 26 2025 14:47:00 GMT+0000 (Coordinated Universal Time)
Telagana : థిక్కరించేవారు లేరు... ప్రశ్నించే వారు లేరు...అంతా తానే అయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆయనకు పోటీగా కాంగ్రెస్ లో మరొక నేత కనిపించడం లేదు. ఆ ప్రయత్నంలోనూ ఎవరూ లేరు. అందుకే తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను పదేళ్ల పాటు ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటున్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల విషయంలోనూ రేవంత్ రెడ్డి తన మాట చెల్లుబాటు చేసుకునేలా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏ నియామకం జరిగినప్పటికీ అందుకు రేవంత్ రెడ్డి అంగీకరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్ కు, ప్రభుత్వానికి అంతా తానే అయి వ్యవహరిస్తున్నారన్నది వాస్తవం.
రేవంత్ నిర్ణయాలను...
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో కనిపించేవి. కానీ తర్వాత రోశయ్య, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హయాంలోనూ గ్రూపులు బాహాటంగా బయటపడేవి. కానీ మళ్లీ 2004 నాటి పరిస్థితులు కాంగ్రెస్ లో కనిపిస్తున్నాయన్నది వాస్తవం. కాంగ్రెస్ లో సీనియర్ నేతల నుంచి మంత్రుల వరకూ ఎవరూ రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని థిక్కరించే పరిస్థితులు లేవు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా రేవంత్ రెడ్డి కారణంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందని బలంగా నమ్ముతుంది. అదే సమయంలో నాయకత్వం మరొకరికి చేతుల్లోకి బదిలీ చేసే ఆలోచన కూడా వారిలో కనిపించకపోవడం విశేషం. ఎందుకంటే సాఫీగా సాగుతున్న ప్రభుత్వంలో వేలు పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉంటుంది.
పార్టీలోనూ...
మరొకవైపు పార్టీలోనూ రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుంది. పీసీసీ కార్యవర్గంలోనూ, అలాగే జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎంపికలోనూ రేవంత్ చెప్పిన నేతల పేర్లే దాదాపుగా ఫైల్ అవుతున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ మాటకు జై కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల్లో గెలుపు, ఓటముల బాద్యతను కూడా రేవంత్ రెడ్డి తానే స్వయంగా తీసుకుంటుండటం, ప్రత్యర్థి పార్టీలకు బలంగా సమాధానమిచ్చే మరొక నేత లేరు. అందుకే పార్టీలో వ్యతిరేక గళం విప్పే నేతలు సయితం నేడు సైలెంట్ అయిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తిరుగులేని లీడర్ గా చెలామణి అవుతున్నారు.
Next Story

