Sat Apr 11 2026 20:07:19 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : రేవంత్ ను నమ్ముతారా? నిజాలను జనం అంగీకరిస్తారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్భయంగా నిజాలు చెప్పి మరోసారి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్భయంగా నిజాలు చెప్పి మరోసారి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో కొన్నింటిని అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరికొన్ని వాటిని ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇందుకు నిధుల కొరత అని ఆయన తరచూ చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తీ కట్టడంతోనే ఆదాయం సగం సరిపోతుందని, మిగిలింది ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకు ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి నిజాయితీగానే చెబుతున్నప్పటికీ ఎంత వరకూ జనం నమ్ముతారన్నది ఇప్పుడు చూడాలి.
అనేక హామీలు ఇచ్చినా...
ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు అనేక రకాలైన హామీలు ఇస్తుంటాయి. నిజాయితీగా తాము చెప్పిన హామీలు అమలు చేయాలని భావించినప్పటికీ నిధుల సమస్య ఇబ్బంది పడుతుంది. అందులోనూ రేవంత్ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే అదనపు సాయం అంతంత మాత్రమే. అందుకే ఇప్పటి వరకూ కొన్ని హామీలను అమలు చేయలేకపోయారు. అందుకే ఆయన ఈ మధ్య పెళ్లి అయిన మూడు రోజుల్లోనే పిల్లలు పుట్టలేదంటే ఎలా? తొమ్మిది నెలలు వేచి చూడాలి. అన్న కామెంట్స్ చేశారంటే తాను నిజాయితీగానే ఉన్నానని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని చెప్పకనే చెప్పినట్లయింది.
విపక్షాల విమర్శలను పక్కపెట్టి...
విపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నప్పటికీ దానిని పెద్దగా పట్టించుకోకుండా తాను అనుకున్న సమయానికే ఇస్తున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేసి చూపించారు. రైతు భరోసాను కొంత ఆలస్యంగా అమలు చేశారన్న విమర్శలను ఎదుర్కొన్నారు. పింఛను, మహిళలకు నెలకు 1,500 రూపాయలు, కల్యాణమస్తు పథకాలను అమలు చేయాల్సి ఉంది. ప్రజలకు వాస్తవాలు చెప్పి తనను నమ్మాలని మరొకసారి ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. మరి ప్రజలు దీనిని ఎలా తీసుకుంటారన్నది చూడాలి.
Next Story

