Wed Feb 19 2025 22:16:32 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మహిళలకు గుడ్ న్యూస్.. ఆ డబ్బులు మాత్రం వారి ఖాతాల్లోనే
తెలంగాణలో మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణలో మహిళలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆత్మీయ భరోసా పథకం కింద ఇచ్చే నిధులను మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ కూలీలకు అందించే ఈ పథకాన్ని మహిళలకు అందించాలని నిర్ణయించారు. వ్యవసాయ కూలీల ఇళ్లలో ఉన్న మహిళల ఖాతాల్లో నగదును జమ చేయాలని నిర్ణయించింది. జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా నిధులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు గ్రామ సభలు తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ వరకూ గ్రామ సభలను నిర్వహించి అందులో లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.
తాజా ఆదేశాలు...
అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ భరోసా కింద ఇచ్చే నగదును ఆ ఇంట్లో ఉన్న మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తే అది కుటుంబానికి ఉపయోగపడతాయా? లేవా? అన్న కారణాలతోనే మహిళల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడతగా ఈ నెలలో ఆరు వేల రూపాయలు జమ చేయనుండటంతో అవి దుర్వినియోగం కాకుండా మహిళల ఖాతాల్లో జమ చేయాలని ప్రాధమికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇరవై రోజులు పనిదినాలుగా...
అయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం కింద ఏడాదికి పన్నెండు వేలు ఇచ్చే లబ్దిదారుల విషయంలోనూ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన వారికి మాత్రమే దీనిని వర్తింప చేయనున్నారు. దానిని ఒక కుటుంబం యూనిట్ గా అమలు చేయనున్నారని అధికారికవర్గాలు తెలిపాయి. ఇంట్లో ఇద్దరు మహిళలుంటే అందులో పెద్ద వయసున్న మహిళ ఖాతాలోనే ఈ నగదును జమ చేయనున్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులు అంటే వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్న హామీని ఈ నెల 26వ తేదీ నుంచి నెరవేర్చడానికి సిద్ధమయింది.
Next Story