Sat Dec 13 2025 22:32:18 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : 2034 వరకూ కాంగ్రెస్ దే అధికారం
మరో పదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

మరో పదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ 2034 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నిజంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవాలనుకుంటే ఢిల్లీ నుంచి ఎందుకు కేంద్ర మంత్రులు ప్రచారానికి రాలేదని ప్రశ్నించారు. కిషనర్ రెడ్డి కాళేశ్వరం, ఫార్ములా ఈ రేసు కేసు గురించి ఎందుకు ప్రస్తావించలేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. కేవలం బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడానికే ఈ రకమైన ప్రచారం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేటీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరూ తోడు దొంగలన్నారు.
కేటీఆర్ అరెస్ట్ పై...
ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేయాలని అనుకున్నప్పటికీ గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతపై విచారణను సీబీఐకి అప్పగించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. సీబీఐ ఇంత వరకూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోవడానికి కారణం కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. హిందువులంతా ఓటు వేయాలని బండి సంజయ్ కోరుతున్నారని, కానీ బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీజేపీ డిపాజిట్ రాకపోతే హిందువులు ఓట్లేయనట్లే కదా? అని రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఎటు పోయారని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై...
త్వరలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరూ బ్యాడ్ మైండ్ సెట్ తో ఉన్నారని చెప్పారు. సెంటిమెంటా? డెవలెప్ మెంటా? అన్నది జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సభకు రావడం లేదని, ఇక జూబ్లీహిల్స్ లో గెలిచి సభకు ఏం వస్తారని? నియోజకవర్గానికి ఏం చేస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సొంత చెల్లిని, మాగంటి సునీతను కూడా కేటీఆర్ మోసం చేస్తాడని అన్నారు. కేంద్రంతో తగాదాలు పెట్టుకునే ఉద్దేశ్యం తమకు లేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకు రావడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని రేవంత్ రెడ్డి చెప్పారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చదువుకున్న వ్యక్తి అని, రౌడీ అని ఎలా అంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story

