Mon Dec 15 2025 07:25:03 GMT+0000 (Coordinated Universal Time)
SLBC Accident : రెస్క్యూ ఆపరేషన్ కు ఎండ్ కార్డు పడేది అవకాశం లేదట.. ఇంకా అక్కడకు వెళ్లలేని బృందాలు
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ముగిసే అవకాశం కనిపించడం లేదు

శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ముగిసే అవకాశం కనిపించడం లేదు. నేటికి సహాయక చర్యలు 61వ రోజుకు చేరుకున్నాయి. బురద, మట్టితో పాటు టీబీఎం శకలాలను బయటకు తరలించడమే పెద్ద పని అయిపోయింది. అది పూర్తయితే కాని ప్రమాదం జరిగిన ప్రాంతంలో తవ్వకాలు జరపడానికి వీలులేదు. 281 మీటర్లలో పేరుకు పోయిన బురద, మట్టి, శకలాలు, బండరాళ్లను సయితం తొలగించారు. అందుకే ఇంకా మృతదేహాల గాలింపు చర్యలు ఇంకా ప్రారంభం కాలేదు.
ఇంకా అక్కడకు చేరుకోలేక...
ఉబికి వస్తున్న నీటిని బయటకు పూర్తిగా పంపి టన్నెల్ లో తవ్వకాలకు అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే మృతదేహాల వెలికి తీత సాధ్యమవుతుందని అధికారులు కూడా చెబుతున్నారు. దీనిపై రేపు అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే ప్రమాదం జరిగి రెండు నెలలు దాటడంతో మృతదేహాలు గుర్తు పట్టని రీతిలో ఉంటాయని, కేవలం అవశేషాలు మాత్రమే లభ్యమవుతాయని అంటున్నారు. అదే జరిగితే ఫోరెన్సిక్ నిపుణుల ద్వారానే ఎవరి మృతదేహాలు వారి బంధువులకు అప్పగించడానికి వీలవుతుంది.
డేంజర్ జోన్ లో ఉన్న...
డేంజర్ జోన్ లో ఉన్న మృతదేహాలను వెలికి తీయాలంటే 43 మీటర్ల పరిధిలో తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. అయితే అక్కడ తవ్వకాలు జరపాలంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయన్న అంచనాలు వినపడుతున్నాయి. డేంజర్ జోన్ లోకి వెళితే మళ్లీ ప్రమాదం జరుగుతుందేమోనని భావించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిపుణుల కమిటీ ఏ రకమైన సూచనలు చేస్తుందన్నది ఉత్కంఠగా ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి అక్కడ తవ్వకాలు జరుపుతారని సహాయక బృందాలు చెబుతున్నాయి. మృతుల కుటుంబాలు మాత్రం ఇంకా తమ వారి మృతదేహలు ఎప్పుడు అప్పగిస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్నాయి. మొత్తం మీద శ్రీశైలం టన్నెల్ ప్రమాదంలో మరికొన్ని రోజుల పాటు రెస్క్చూ ఆపరేషన్ కొనసాగే అవకాశముంది.
Next Story

