Wed Jan 28 2026 23:51:52 GMT+0000 (Coordinated Universal Time)
సంగారెడ్డిలో ఘోర ప్రమాదం .. ఐదుగురు కార్మికుల మృతి
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దాదాపు ఐదుగురు మరణించారు

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దాదాపు ఐదుగురు మరణించారు. మృతులు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారని చెబుతున్నారు. రియాక్టర్ పేలడంతో భవనం కూలిపోయింది. పెద్దయెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇరవై మంది కార్మికులు గాయపడ్డారు. మరో పదిహేను మంది కార్మికులు చిక్కుకుపోయారని అంటున్నాు. గాయపడిన కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి కార్మికులు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
రియాక్టర్ పేలుడు ధాటికి...
పేలుడు ధాటికి రియాక్టర్ ఉన్న భవనం కూలిపోయింది. మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకు వచ్చారు. అయినా సరే దట్టమైన పొగ అలుముకోవడంతో లోపలికి వెళ్లేందుకు వీలుపడటం లేదు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న క్షతగాత్రులను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. స్థానికులు ఎవరూ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు రావద్దని పోలీసులు చెబుతున్నారు.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్...
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. తమ వాళ్లు కనిపించక, ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో అక్కడకు వచ్చిన కార్మికుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పదకొండు ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ పొగ కమ్ముకోవడంతో పాటు ఘాటు వాసనతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సంఘటన స్థలికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Next Story

