Sun Mar 22 2026 11:05:05 GMT+0530 (India Standard Time)
Telangana : కర్షకులకు గుడ్ న్యూస్...నేడు రైతు భరోసా నిధుల విడుదల
తెలంగాణ రైతులకు ప్రభుత్వం నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది

తెలంగాణ రైతులకు ప్రభుత్వం నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈరోజు రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతులకు యాసంగిలో పెట్టుబడి సాయం కింద నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి బహిరంగ సభ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు విడతలుగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. రైతు భరోసా నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని ప్రతిపక్షాల విమర్శలకు ఈ సభ ద్వారా సమాధానం చెప్పనున్నారు
రైతు ప్రయోజనాలకు...
రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాలను అన్నదాతల సమాజానికి పంపే ప్రయత్నం చేయనున్నారు.తెలంగాణలో త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కంటే ముందుగానే రైతు భరోసా నిధులను జమ చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు.మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నిజం చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మొత్తం మూడు విడతల్లో నిధులను విడుదల చేయనున్నారు. తొలుత 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు.
మొత్తం మూడు విడతల్లో...
మొత్తం మూడు విడతల్లో 9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సిద్ధిపేట జిల్లా నర్మెట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద, అర్హత కలిగిన రైతులు ఎకరానికి సీజన్‌కు 6,000 చొప్పున, రబీ మరియు ఖరీఫ్ పంట సీజన్లలో ఏటా ఎకరానికి రూ. 12,000 చొప్పున అందివ్వ నున్నారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. ఎకరం నుంచి మొదలు పెట్టి ఎన్ని ఎకరాలున్నప్పటికీ అందరికీ అందించేలా ఈ రైతు భరోసా నిధులు అందనున్నాయి. అయితే సాగు అయ్యే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు అందనున్నాయి. మొత్తం మీద నేడు అన్నదాతల ముఖంలో ఆనందం వెల్లివిరియనుంది.
Next Story

