Sat Dec 06 2025 02:31:02 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : బెదిరింపులకు దిగుతున్న కార్పొరేట్ సంస్థలు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికేనా?
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వైద్య, విద్య విషయాల్లో ప్రయివేటు సంస్థలు షాక్ ఇస్తున్నాయి. బ్లాక్ మెయిల్ కు దిగుతున్నాయి

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వైద్య, విద్య విషయాల్లో ప్రయివేటు సంస్థలు షాక్ ఇస్తున్నాయి. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం కింద నిధులను విడుదల చేయడం లేదని ప్రయివేటు కళాశాలలను బంద్ చేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి. ఈరోజు కొన్ని కళాశాలలను బంద్ చేశాయి. దాదాపు పద్దెనిది వందల కోట్ల రూపాయలకు సంబంధించి టోకెన్లు ఇచ్చినప్పటికీ వాటికి సంబంధించిన నగదు చెల్లింపు జరగలేదని ప్రయివేటు కళాశాలల యాజమాన్యం చెబుతుంది. అవి చెల్లించేంత వరకూ కళాశాలలను బంద్ చేస్తామని ప్రభుత్వానికి ప్రయివేటు కళాశాలల యాజమాన్యం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమయింది.
ఫేక్ సిబ్బందితో.. అక్రమంగా...
అయితే ప్రభుత్వం వాదన మరొకలా ఉంది. ప్రయివేటు కళాశాలలు సరైన అధ్యాపక సిబ్బంది లేకుండా కేవలం రికార్డుల్లోనే చూపుతూ, విద్యార్థుల సంఖ్య విషయంలో కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని అనుమానిస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రయివేటు కళాశాలల విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నివేదిక సమర్పించారు. అనేక ఇంజినీరింగ్ కళాశాలలో సరైన వసతులు లేకుండానే విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేయడానికి, ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద దోచుకోవడానికి సిద్ధమయ్యాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాణ్యమైన విద్య అందించకుండా ఈ పథకాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నకిలీ సర్టిఫికెట్లు పెట్టి దోపిడీకి తెరతీశాయంటున్నారు. మొత్తం మీద ప్రయివేటు కళాశాలల యాజమాన్యం ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది.
రేపు అర్ధరాత్రి నుంచి...
మరొకవైపు ప్రయివేటు వైద్య శాలలు కూడా ఇదేరకమైన బెదిరింపులకు దిగాయి. బకాయి చెల్లింపులు ఆలస్యం అవుతున్నందుకు నిరసనగా తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిరవధికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అధికారులతో పలు సార్లు చర్చలు జరిపినా, హామీలు ఇచ్చినా, చెల్లింపుల విడుదలలో ఆలస్యం కొనసాగుతూనే ఉందని స్పష్టం చేసింది. ప్రజలకు, లబ్ధిదారులకు కలిగే అసౌకర్యంపై చింతిస్తూ, తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరింది. అయితే ఆరోగ్య శ్రీ సేవల విషయంలో కూడా దొంగ బిల్లులు చేసుకుని నగదును తమ ఖాతాల్లో వేసుకుంటున్నాయన్న భావన సామాన్య ప్రజల్లో ఉంది.
ఆరోగ్య శ్రీపేరుతో దొంగ బిల్లులు...
ఆరోగ్య శ్రీపేరుతో దొంగ బిల్లుల సృష్టించడమే కాకుండా, అవసరం లేకపోయినా ఆపరేషన్ లు, ఇన్ పేషెంట్ గా ఉంచడంతో పాటు వారికి నాణ్యమైన వైద్యం అందించకుండానే ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల బిల్లులను కాజేసేందుకు ప్రయివేటు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిపై కూడా సమగ్ర విచారణ జరపాలన్నడిమాండ్ ఉంది. ఈ ఏడాది తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ దఫా హెచ్చరిక. దీనికంటే ముందు పది రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసి, చెల్లింపులు చేస్తామన్న అధికారుల హామీ తరువాత సమ్మెను ఉపసంహరించుకుంది. మొత్తం మీద ప్రయివేటు విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వంపై బ్లాక్ మెయిల్ కు దిగడం చర్చనీయాంశమైంది.
Next Story

