Wed Feb 11 2026 09:28:35 GMT+0530 (India Standard Time)
Telangana : నేడు మున్సిపల్ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రానికి ఏ కార్డు అనుమతిస్తారంటే?
నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది

నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 414 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డుల్లో ఎన్నిక జరగనుంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ కోసం నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు.రాష్ట్రంలో ఒకే విడత ఈ ఎన్నికను నిర్వహించనున్నారు. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నేటి పోలింగ్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను వాహనాల్లో తరలించవద్దని ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం వంటివి నిషిద్ధమని తెలిపింది. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అసవరమైన వాతావరణం కల్పించేలా రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కోరింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే టోల్ ఫ్రీ నెంబరు కు ఫోన్ చేసి సమాచారం అందచేయాలని కోరింది.
ఈ గుర్తింపు కార్డులుంటే...
పోలింగ్ కేంద్రాలకు ఓటర్ గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేయడానికి అనుమతిస్తారు. అయితే ఇతర కార్డులను చూపిస్తే ఓటు హక్కు వేసుకోవడానికి అనుమతిస్తారు. మొత్తం పన్నెండు రకాల కార్డులను అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వాటిని అనుమతించాలని ఇప్పటికే పోలింగ్ కేంద్రంలో ఉన్న సిబ్బందికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్టు, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ జారీ చేసిన పాస్ బుక్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, ఫొటోను కలిగి ఉన్న పింఛను కార్డు, ఉపాధి హామీ కార్డు, ఎన్.పి.ఆర్. స్మార్ట్ కార్డు, కేంద్ర, ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన ఐడీ కార్డులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎంఎల్సీ అధికారిక ఐడీ కార్డులు, దివ్యాంగులకు జారీ చేసిన కార్డులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి చెల్లుబాటు అవుతాయి.
Next Story

