Sat Dec 13 2025 19:30:44 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్ బద్దలు.. దేశంలో దొరికిపోయిన ప్లెడ్లర్లు.. యాభై మంది నైజీరియన్ ల అరెస్ట్
తెలంగాణా ఈగల్ ఫోర్స్ ఢిల్లీ డ్రగ్స్ రాకెట్ ను బద్దలు కొట్టింది

తెలంగాణా ఈగల్ ఫోర్స్ ఢిల్లీ డ్రగ్స్ రాకెట్ ను బద్దలు కొట్టింది. గత రెండు నెలలుగా శ్రమించి ఈ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తో పాటు డబ్బులను కూడా సీజ్ చేసినట్లు తెలిసింది. ఈగల్ ఫోర్స్ సిబ్బంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో , ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌తో కలిసి భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహించారు. నోయిడా పోలీసు సహకారంతో భారత్ అంతటా నడిచిన నైజీరియన్ డ్రగ్ కార్టెల్‌ను లక్ష్యంగా తీసుకున్నారు. ఢిల్లీలో మొత్తం ఇరవై చోట్ల ఒకేసారి దాడులు చేసి ఓవర్స్టేలో ఉన్న యాభై మందికి పైగా నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు. నోయిడా, గ్వాలియర్, విశాఖపట్టణం ప్రాంతాల్లో కార్టెల్ కీలక సభ్యులను కూడా పట్టుకున్నారు.
సంయుక్త ఆపరేషన్ లో...
ఈ ఆపరేషన్‌లో అనేక ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు. నాలుగు చోట్లనుంచి 5,340 ఎక్స్టసీ గోలీలు, 250 గ్రాముల కోకైన్, 109 గ్రాముల హెరాయిన్, 250 గ్రాముల మెతాంఫెటమిన్ను పట్టుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.3.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. . భారీ నగదును కూడా స్వాధీనం చేశారు. ఢిల్లీలో 59 మ్యూల్ ఖాతాలు, 16 ప్రధాన కార్టెల్ హబ్‌లను గుర్తించారు. 107 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ సంయుక్త ఆపరేషన్ తో కార్టెల్ సరఫరా నెట్వర్క్ ను పట్టుకున్నామని అధికారులు తెలిపారు. కొరియర్ సర్వీస్ లను ఉపయోగించుకుని, మహిళల ద్వారా ఈ డ్రగ్స్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
రెండు నెలల నుంచి...
సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని మాల్నాడు రెస్టారెంట్, మహీంద్రా యూనివర్శిటీ కేసుల దర్యాప్తునకు గానూ అధికారులు కీలక సమాచారం సేకరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఆర్డర్లు నైజీరియాలో ఉన్న ప్రధాన కార్టెల్ ఆర్గనైజర్ నిక్ అనే వ్యక్తికి వెళుతున్నాయని గుర్తించారు. అతడు విదేశాల్లో నుంచే నడిపించే రెండు ఫోన్ నంబర్లను ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తు తెలిపింది. సమాచారం అందిన వెంటనే తొందరపడకుండా ఈ డ్రగ్స్ ర్యాకెట్ వెనక ఎవరెవరున్నారన్న విషయాన్ని కూడా ఈ ఆపరేషన్ లో పోలీసులు గుర్తించగలిగారు. మొత్తం 150 మంది ఈగల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఢిల్లీకి వెళ్లి అక్కడి పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ఈ దాడులు నిర్వహించారు. తెలంగాణ ఈగల ఫోర్స్ నిర్వహించిన ఈ దాడులతో దేశ వ్యాప్తంగా మూలాలనున్న డ్రగ్స్ రాకెట్ బద్దలయింది.
Next Story

