Fri Dec 05 2025 12:23:40 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : మూసీ నది పునరుజ్జీవం చేయక తప్పదా?
హైదరాబాద్ లో ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. మూసీ, ఈసీ నదులు ఉప్పొంగి ప్రవహించే అవకాశాలున్నాయని అంచనా వేసింది

హైదరాబాద్ లో ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. మూసీ, ఈసీ నదులు ఉప్పొంగి ప్రవహించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ మేరకు అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వికారాబాద్ లో భారీ వర్షం పడుతుండటంతో మూసీ, ఈసీ నదులు ఈరాత్రికి ఉప్పొంగి ప్రవహించే అవకాశముందని కూడా అధికారులు చెబుతున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని కాలనీలు నీట మునిగాయి.దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిన్న కురిసిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో పలు లోతట్టు కాలనీలు మునిగిపోయాయి.
నగరం నీట మునిగి...
వీధులు, ప్రధాన రహదారులు నీటమునిగిపోయి రాకపోకలు దాదాపు ఆగిపోయాయి. మూసారాం బ్రిడ్జి, చాదర్ ఘాట్ వంతెన పై నుంచి ఆరడుగుల మేర నీరు ప్రవహించింది. అలాగే మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లోనూ నీరు చేరింది. పరిసరాలు పూర్తిగా మునిగిపోవడంతో బస్ సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది. ప్రయాణికుల కోసం ఎక్కే ప్రదేశాలను అధికారులు మార్చారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు నేడు చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం, హైడ్రా బృందాలు కలసి మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. వర్షపాతం ఇంకా కొనసాగుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అదృష్ణ వశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తినష్టం బాగానే జరిగినట్లు తెలిసింది.
మూసీ నది ఆక్రమణలపై...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మూసీ పునరుజ్జీవం పధకంపై మాట్లాడుతున్నారు. దీనికి అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలుపుతున్నాయి. మూసీ పునరజ్జీవ ప్రాజెక్టు అవసరాన్ని నిన్నటి కురిని వర్ష బీభత్సం కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇలాగే మరికొన్నేళ్లు ఉంటే నగరం ఖచ్చితంగా నీటిలో మునుగుతుందన్న ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ బయలుదేరింది. నగరంలో ఎక్కడ చూసినా నీరు చేరింది. అలాగే మూసీ ఒడ్డున ఉన్న అనేక ఆక్రమణలను తొలగించాల్సిన అవసరాన్ని ఇప్పుడు అందరూ గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉంటాయో.. వర్షాలు కూడా అదే స్థాయిలో ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇప్పటికైనా ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలన్న వాదనలు మొదలయ్యాయి.
Next Story

