Tue Dec 23 2025 14:35:47 GMT+0000 (Coordinated Universal Time)
Congress : మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ ను ముప్పుతిప్పలు పెట్టనున్నాయా?
కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న మున్సిపల్ ఎన్నికలు సవాల్ అని చెప్పాలి.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న మున్సిపల్ ఎన్నికలు సవాల్ అని చెప్పాలి. పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఆశించినంతగా ఫలితాలు రాలేదనే చెప్పాలి. బీఆర్ఎస్ కు పంచాయతీ ఎన్నికల్లో బాగానే ఫలితాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలంటే గుర్తులుండవు. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే పార్టీలుగా విడిపోయి ప్రచారం చేసుకోవడంతో గ్రామాల్లో ప్రధాన పార్టీలన్నీ పోటీ చేశాయి. అయితే గ్రామాలు.. వేరు పట్టణాలు వేరు. పట్టణ ఓటర్లు ఒక పట్టాన అర్ధం కాదు. పట్టణ ఓటర్లు ఖచ్చితంగా పార్టీ పాలనను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటారు. డెవలెప్ మెంట్ చూస్తారు. అలాగే సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మరీ ఓటేస్తారు.
పంచాయతీ ఎన్నికలంత...
అందుకే పంచాయతీ ఎన్నికలంత సులువు కాదు. అలాగే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లాంటి ఉప ఎన్నికలు కూడా కావు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ కు అంత ఈజీ కాదు. పట్టణ ఓటర్లను అంత సులువుగా మభ్యపెట్టలేరు. పార్టీలను కాకుండా అభ్యర్థులను చూసి ఓటేసే వారు కూడా అత్యధికంగా ఉంటారు. అందుకే ఈ ఎన్నికల్లో మంత్రులకు సవాల్ అని చెప్పాలి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతను ఇన్ ఛార్జి మంత్రులకే అప్పగించారు. అక్కడ ఓటమి అయినా.. గెలుపు అయినా వారిదే బాధ్యత అని మంత్రుల మొహం మీద చెప్పేయడానికి కారణం అదే. అలాగే డబ్బులు కూడా పట్టణ ప్రాంతాల్లో పనిచేయవు.
పట్టణ ఓటర్లంటే...
బీఆర్ఎస్, బీజేపీలు కూడా పట్టణాల్లో పట్టు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ తప్పేట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సంతృప్త స్థాయిలతో పాటు అసంతృప్త స్థాయిలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. పింఛనుదారుల నుంచి నిరుద్యోగులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు పట్టణ ఓటర్లుగా తమ తీర్పును చెప్పనున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కత్తిమీద సాము లాంటివనే చెప్పాలి. రేవంత్ రెడ్డి అందుకే మున్సిపల్ ఎన్నికల విషయంలో సీరియస్ గా ఉన్నారు. మంత్రులనే బాధ్యులను చేసినప్పటికీ మంత్రులు ఏ స్థాయిలో పార్టీ గెలుపునకు ఉపయోగపడతారన్నది చూడాల్సిందే.
Next Story

