Fri Feb 13 2026 23:25:58 GMT+0530 (India Standard Time)
Telagngana : నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ నెల 12వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదయింది. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పర్చిన బ్యాలెట్ బ్యాక్సులను ఉదయం పార్టీల ఏజెంట్ల సమక్షంలో తెరిచి లెక్కింపు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు కాని ఫలితాలపై క్లారిటీ రాదు.
అన్ని పార్టీల్లోనూ ధీమా...
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అన్ని రాజకీయ పార్టీలు ధీమాగా ఉన్నాయి. అధికార కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని చెబుతుంది. ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి ఓటు వేశారని, ప్రజాపాలనకు అండగా నిలిచారని అంటోంది. మరొకవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడమే కాకుండా, అన్ని వర్గాలను నిలువునా రెండేళ్ల నుంచి మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక బీజేపీ త్రిముఖ పోరులో తమ విజయం ఖాయమన్న అంచనాలో ఉన్నారు. పోలింగ్ రోజున ఎలా అయితే కార్యకర్తలు పార్టీ కోసం నిలబడ్డారో అలాగే కౌంటింగ్ హాలులో కూడా ప్రతి ఓటు విషయంలో అలెర్ట్ గా ఉండాలని సూచించింది. ఎంఐఎం కూడా కొన్ని మున్సిపాలిటీలను తాము కైవసం చేసుకుంటామని చెప్పింది.
మూడంచెల భద్రత మధ్య...
ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 వ సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎటువంటి ప్రదర్శనలు, ఊరేగింపులకు అనుమతి లేదని తెలిపారు. కౌంటింగ్ వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గెలిచిన అభ్యర్థులు కానీ, ఓడిన వారు కానీ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగవద్దని, అలా చేస్తే తాము చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరొకవైపు కొన్ని కార్పొరేషన్లలో ఫలితాలకు ముందే అభ్యర్థులను క్యాంప్ లకు తరలించారు. ఫలితాలు వచ్చిన తర్వాత నేరుగా మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికకు తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొత్తం మీద అన్ని పార్టీల్లోనూ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి.
Next Story

