Fri Dec 05 2025 09:11:19 GMT+0000 (Coordinated Universal Time)
Raja Singh : ఏం చేస్తారో చేస్కోండి.. అంటూ సవాల్ విసిరిన రాజాసింగ్
గోషామహల్ రాజాసింగ్ ను బీజేపీ నుంచి ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసి నెలలు గడుస్తుంది. అయినా ఎమ్మెల్యే విషయంపై ఎటూ తేల్చలేదు

గోషామహల్ రాజాసింగ్ ను బీజేపీ నుంచి ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసి నెలలు గడుస్తుంది. అయినా ఎమ్మెల్యే విషయంపై ఎటూ తేల్చలేదు. స్పీకర్ కు బీజేపీ లేఖ రాయలేదు. దీంతో రాజాసింగ్ మరోసారి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుపై కూడా రాజాసింగ్ మరొకసారి ఫైర్ అయ్యారు. తోలుబొమ్మలా మారి వ్యవహరించవద్దని, సొంత నిర్ణయాలు తీసుకోవాలని సూచించడం మరోసారి తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశమైంది. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తాను మాత్రం ఎప్పటికీ బీజేపీని అభిమానిస్తూనే ఉంటానని రాజాసింగ్ చెప్పడం ఇక్కడ కొసమెరుపు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయినా...?
మూడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయిన తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదని ఆయన మరోసారి పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అక్కసు వెళ్లగక్కారు. కార్యకర్తలుగా పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని తాను కోరడం తప్పా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి తాను పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, నాయకత్వం పిలిచి మాట్లాడితే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలను చెబుతానని రాజాసింగ్ తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న కమిటీతో మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాదని తేల్చి చెప్పి మరోసారి రాష్ట్ర బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారారు. తెలంగాణలో కొందరు నేతలు బీజేపీని నాశనం చేస్తున్నారని రాజాసింగ్ అన్నారు. పార్టీతో తనకున్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు.
పార్టీలో లేకపోవడంతో...
తనను నాలుగోసారి కూడా గోషా మహల్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తారని రాజాసింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని రాజాసింగ్ తెలిపారు. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసిరారు. పార్టీ కోసం కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. దీంతో రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా గీత దాటారని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవి విషయంలో బీజేపీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాజాసింగ్ తన ధోరణని మార్చుకునే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో రాజాసింగ్ కమలనాధులకు తలనొప్పిగా తయారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు పార్టీలో కూడా లేకపోవడంతో రాష్ట్ర బీజేపీ నేతలు హస్తిన వైపు చూస్తున్నారట.
Next Story

