కవిత ధర్నా పెద్ద జోక్.. ఆర్ కృష్ణయ్య గొంతు మూగపోయింది : మంత్రి కొండా సురేఖ
కవిత ధర్నా చేయడం పెద్ద జోక్ అని మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు.

కవిత ధర్నా చేయడం పెద్ద జోక్ అని మంత్రి కొండా సురేఖ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదు.. అప్పుడు ఎందుకు కవిత మాట్లాడ లేదని ప్రశ్నించారు. ఉనికి కోసం కొన్ని రోజులు బతుకమ్మ, జాగృతి అని.. కవిత ఇప్పుడు బీసీ ఉద్యమం అంటుందన్నారు. కవిత మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నాయన్నారు.
రాహుల్ గాంధీ హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని కులగణన చేయడం జరిగిందన్నారు. బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టినపుడు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.. కానీ, బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నుంచి 3 నెలలుగా ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రధాని మోదీ బీసీ అని చెప్పుకుంటారు.. కానీ, బీసీల బిల్లుపై మాట్లాడరు.. రాహుల్ గాంధీ పోరాటం వల్లే జనగణనలో కులగణన జరుగుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలి అని డిమాండ్ వస్తోంది.. 42% బిల్లు ఆమోదం తెలిపే వరకు పోరాటం చేద్దామని సూచించారు. బండి సంజయ్ బీసీ బిడ్డ అంటాడు.. మరి ఎందుకు బిల్లు గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్యకు ఎంపీ పదవి రాగానే గొంతు మూగపోయిందన్నారు.

