Sat Apr 11 2026 12:11:52 GMT+0530 (India Standard Time)
Summer Effect : బిగ్ అలర్ట్.. పది రోజులు బయటకు రావద్దు.. ఎండలు ఎక్కడంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. భానుడు భగభగలతో మండిపోతున్నాయి. ఒడిశా, తమిళనాడు, తెలంగాణను ఆనుకొని ఉపరితల ఆవర్తనం నెలకొంది. దాంతో సముద్రమట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు మెరుపులతో జల్లులు పడే అవకాశం ఉందని, మూడు రోజులపాటు ఏపీ, కర్ణాటకలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో ఇక్కడ టెంపరేచర్స్...
ఆంధ్రప్రదేశ్ లోనూ ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. సూర్యడి ప్రతాపంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరంలో 38 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదుకు అవకాశం ఉంది. ఇక గూడూరు, నంద్యాల, అనంతపురంలో 38 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి. అదే విధంగా ఉత్తరాంధ్రలోని 16 మండలాల్లో వడగాల్పులకు అవకాశమున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్రకు వడగాలుల హెచ్చరిక జారీ అయింది. రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అకాల వర్షాలతో పడటంతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్...
తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది. తెలంగాణలో 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. తెలంగాణలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వరుసగా 10 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంని హెచ్చరించింది. హైదరాబాద్లో కూడా నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలు మధ్యాహ్నం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Next Story

