Thu Apr 02 2026 11:32:43 GMT+0530 (India Standard Time)
Summer Effect : పగటి వేళ అప్రకటిత కర్ఫ్యూ.. ఎండల దెబ్బకు హడల్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రానున్న కాలంలో ఇంకెంత స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతాయోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేడిగాలుల ఉధృతి కూడా అధికంగా ఉంటుందని, సెగగాలుల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని, వీలయినంత వరకూ ప్రజలు పగటి వేళ బయటకు రాకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.
వానలు పడి వెలిసిన తర్వాత...
ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉపరితల ద్రోణి, ఆవర్తనం మేరకు ఇటీవల అక్కడక్కడ చిరుజల్లులు, మోస్తరు వానలు కురిసినప్పటికీ ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరిగింది. కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 40.7 డిగ్రీలు,కర్నూలు జిల్లా లద్దగిరిలో 39.9, విజయనగరం జిల్లా నెలివాడలో 39.9 డిగ్రీలు, అత్యల్పంగా బాపట్లలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానురాను ఇంకా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలోనూ అత్యధికంగా...
తెలంగాణలోనూ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉక్కపోత వాతావరణం నెలకొని ఉంది. రానున్న కాలంలో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో అత్యధికంగా కొత్తగూడెంలో 40.7 డిగ్రీలు, అత్యల్పంగా యాదాద్రిభువనగిరిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో పాటు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ భానుడి భగభగలు ఉండటంతో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
Next Story

