Tue Dec 23 2025 05:55:44 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : మంచులా మారిపోతున్న రాష్ట్రాలు... ఎప్పటికి వేడెక్కేను గురూ?
చలితీవ్రత ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా చోటు దక్కించుకుంటున్నాయి

చలితీవ్రత ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా చోటు దక్కించుకుంటున్నాయి. సహజంగా ఉత్తర భారతంలో చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈశాన్య భారతంలో మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలితీవ్రత పెద్దగా లేదనే చెప్పుకోవాలి. అదీ ఏజెన్సీ ప్రాంతాల్లో కొంచెం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి తప్పించి మిగిలిన ప్రాంతాల్లో గరిష్టంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారిమాత్రం డిఫరెంట్ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ఏళ్ల నుంచి చలిగాలుల తీవ్రత ఈసారి మాత్రం ఏపీ, తెలంగాణలలో కనిపిస్తుంది. మరొకవైపు చలికి గజగజ వణికిపోతున్నాయి.
ఉక్కపోత ఉండేచోట...
ఆంధ్రప్రదేశ్ లో సముద్రతీర ప్రాంతం ఎక్కువ కావడంతో సహజంగా ఉక్కపోత వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా తుపానులు, అల్పపీడనాల సమయంలోనే కొంచెం చలి అని అనిపిస్తుంది. అదీ దుప్పట్లు కప్పుకునే చలి కాదు. కానీ నేడు చలిగాలుల తీవ్రతకు బయటకు రావడానికి ప్రజలు భయపడిపోతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లో ఐదు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అరకు వంటి ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. చలిని ఎంజాయ్ చేయడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు.
చలిగుప్పిట్లో తెలంగాణ...
తెలంగాణలో ఇక వేరే చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు చలిగుప్పిట్లో మగ్గుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ చలితీవ్రత ఉంటుందో తెలియదు. కానీ జనవరి నెల వరకూ చలి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ వంటి ప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా కనపడుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలోనూ అధికంగానే ఉంది. ఇక ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో భారీగా విద్యుత్తు వినియోగం పడిపోయింది. హైదరాబాద్ లో ఏడు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Next Story

