Sat Dec 13 2025 05:55:32 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : రెండు రాష్ట్రాలకూ వాతావరణ శాఖ అలెర్ట్... మరో మూడు రోజులు కీలకమే
భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరికొద్ది రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది

భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరికొద్ది రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే గత పది రోజుల నుంచి చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నలూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచుతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు పోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. ఉత్తర భారతంలో ఇక చెప్పాల్సిన పనిలేదు. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రమాదాలకు పొగమంచు మాత్రమే కారణమని అధికారులు తేల్చారు.
ఏపీలో తీవ్రమైన చలిగాలులు...
ఆంధ్రప్రదేశ్ లో తవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనేక ప్రాంతాలు చలిగుప్పిట్లో ఉన్నాయి. ఉదయం లేదు.. మధ్యాహ్నం లేదు.. చలికి కొంకర్లు పోతున్నారు. చలి ధాటికి తట్టుకోలేక ప్రజలు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. అరకు, పాడేరు వంటి ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రతను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణం ఉదయం, రాత్రి వేళల్లో ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. పొగమంచు ఉన్నంత కాలం వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు...
తెలంగాణలోనూ చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,మెదక్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ లోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంది. ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే అనేక జిల్లాల్లో అలెర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, చిన్నారులు సాయంత్రం వేళ, ఉదయం వేళ ఇళ్ల నుంచి బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అరకులో నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Next Story

