Thu Mar 19 2026 11:11:36 GMT+0530 (India Standard Time)
Rain Alert : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. నేడు కూడా వానలే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వానలపై వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వానలపై వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణం నెలకొననున్నట్లు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో నేడు రెండు రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశముందని తెలిపింది. అయితే కొన్ని చోట్ల మాత్రమే వానలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో కనిష్టంగానైనా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కొన్ని జిల్లాల్లో వానలు...మరికొన్ని చోట్ల ఎండలు...
ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో ఎండలు కూడా ఉంటాయని, అలాగే కొన్ని జిల్లాల్లో వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో వడగళ్ల వాన...
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పలు ప్రాంతాలను తాకింది. కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, కరీంనగర్, పెద్దపల్లి,మంచిర్యాల,నాగర్కర్నూల్, గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణశాఖ తెలిపింది. రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పలుచోట్ల వడగళ్లు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Next Story

