Fri Dec 05 2025 12:38:34 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలేనట
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొద్ది గంటల్లోనే అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు మందగించడంతో వర్సాలు కురియడం లేదని కూడా పేర్కొంది.
మూడు రోజుల పాటు...
నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చినా కరెక్టగా ఖరీఫ్ సాగు సమయంలో వరుణుడు మొహంచాటేయడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలుపడుతుండటంతో రైతుల కళ్లల్లో ఆనందం కనపడుతుంది. ఈరోజు నిజామాబాద్, మెదక్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బలమైన ఈదురుగాులు వీచే అవకాశముందని చెప్పారు.
చేపల వేటకు వెళితే...
ఆంధ్రప్రదేశ్ లోనూ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లినసమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చేపల వేటకు మత్స్యకారులు వెళ్లకపోవడమే మంచిదని కూడా చెప్పింది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్భిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Next Story

