Fri Dec 05 2025 16:33:51 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : రెండు రాష్ట్రాలకు ఇదే హెచ్చరిక... భారీ వర్షాలు మూడు రోజులట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడేందుకు కూడా అవకాశముందని, పశువుల కాపర్లు, రైతులు చెట్ల కింద, విద్యుత్తు స్థంభాల వద్ద నిల్చొని ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని కూడా సూచించింది.
భారీ నుంచి అతి భారీ వర్షాలు...
తెలంగాణలో నేడు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అదే సమయంలో సాయంత్రం నుంచి రాత్రి వరకూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో తెలంగాణ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. హైదరాబాద్ వాసులకు ప్రత్యేకంగా అలెర్ట్ జారీ చేసింది. సాయంత్రం వేళ వీకెండ్ అని బయటకు రావద్దని భారీ వర్షం పడుతుందని తెలిపింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో...
బంగాళాఖతంలో ఏర్పడిన అల్పపీడన, ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కంది. ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలో ఈరో్జు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమ ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ చెప్పింది. నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు.
Next Story

